Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలను పట్టించుకోని ప్రభుత్వం
- అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్రం
- ప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల
- రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణను సీఎం కేసీఆర్ కుటుంబం పూర్తిగా దోచుకుంటోందనీ, పేదలను మాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా చేవెళ్లలో ప్రారంభించిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర సోమవారం ఆరోరోజు రంగారెడ్డి జిల్లా కందుకూర్కు చేరుకుంది. రాచులూర్ గేట్ నుంచి లేమూరు గ్రామం, అగర్మమియగూడకి పాదయాత్ర కొనసాగింది. రాచులూర్ గ్రామంలో గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేవలం సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే సంపన్నులుగా మారారనీ, నిరుద్యోగ యువతీ, యువకులు రోడ్డున పడ్డారని అన్నారు. పన్నెండు వందల మంది అమరుల త్యాగంతోనే స్వరాష్ట్రం ఏర్పడిందన్నారు. ఎంతోమంది మేధావులు, కళాకారులు తెలంగాణ ఏర్పాటు కోసం ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఒకే కుటుంబ దోచుకు ంటోందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన రాష్ట్రంలో ఏ ఒక్క హామీ అమలు కావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు కేజీ టు పీజీ ఉచిత విద్యతోపాటు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలుతోపాటు అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని తెలిపారు. అగర్మమియగూడలో సోమవారం రాత్రి బస చేయనున్నారు. పాదయాత్రలో వైఎస్ఆర్ టీపీ మండల కన్వీనర్ జపాల కిష్టయ్య, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.