Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనస్థాపంతో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఘటన
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి కేవలం అడ్వాన్స్ మాత్రం చెల్లించి మిగితా డబ్బులు చెల్లించడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన గంగుబాయి తన ఇంటిని, స్థలాన్ని ఉప సర్పంచ్ గోర్తే రాజేందర్‌కు రెండేండ్ల కిందట రూ.41లక్షలకు విక్రయించింది. మొదట ఉపసర్పంచ్ అడ్వాన్స్ కింద రూ.12లక్షలు చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా.. కుటుంబ సభ్యులకు తెలియకుండా గంగుబాయిని మంథం నర్సయ్య అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీసుకు తీసుకెళ్లి తనపేరుపై ఇంటిని, స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. డబ్బులివ్వాలని ఉపసర్పంచ్‌ను అడిగితే 'మీరు మంథం నర్సయ్యకు విక్రయించారు కదా.. అతని వద్దే డబ్బులు తీసుకోండ'ని అంటున్నాడు. డబ్బుల చెల్లింపులో ఇబ్బందులు పెడుతున్నందున విసుగు చెందిన గంగుబాయి మనువడు యాదగిరి తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో పోలీస్ సిబ్బంది పెట్రోల్ డబ్బాను లాక్కుని సముదాయించారు. అనంతరం బాధితులు కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.