Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టులను సమర్థిస్తారా?
- రేవంత్ ఆరోపణలను ఖండించిన డీజీపీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పార్లమెంటు సభ్యుడు, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలో ఎలాంటి నిజమూ లేదని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సోమవారం ఖండించారు. పోలీసు అధికారులలో గ్రూపులున్నాయనీ, తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదనీ, మావోయిస్టులుంటే మంచిదని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను డీజీపీ తన ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టారు. ఫోన్ను ఎవ్వరూ ట్యాపింగ్ చేయడంలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం కమ్యూనికేషన్ల చట్టం ప్రకారం జారీ చేసిన నిబంధనలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర పోలీసు అధికారులలో గ్రూపులు ఏర్పడినట్టు రేవంత్రెడ్డి చేసిన ఆరోపణల్లో సైతం ఎలాంటి నిజం లేదని ఆయన తోసిపుచ్చారు. రాష్ట్రంలో కానిస్టేబుళ్లు మొదలుకుని ఐపీఎస్ అధికారుల వరకూ సమిష్టిగా నిబంధనల ప్రకారం తమ విధులను నిర్వర్తిస్తూ చట్టాన్ని, శాంతి భద్రతలను కాపడుతున్నారని డీజీపీ తెలిపారు. నేరాలను అదుపు చేయడంలోనూ, రాష్ట్రాన్ని శాంతియుతంగా ఉంచడంలోనూ వారందరూ కలిసి కట్టుగా కృషి చేస్తున్నారనీ, ఎలాంటి గ్రూపులూ లేవని ఆయన అన్నారు. మరోవైపు, మావోయిస్టులుంటే బాగుంటుందని రేవంత్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో 350 మంది పోలీసులు, ఇతరులను దారుణంగా హత్య చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మావోయిస్టులను సమర్థిస్తూ ఎంపీ మాట్లాడటం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. బాధ్యతలు కలిగిన ఒక పార్లమెంటు సభ్యుడు ఇలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టవుతుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు.