Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
- కోదాడలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం
నవతెలంగాణ - కోదాడరూరల్
వచ్చే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిని 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటానని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడలోని డేగబాబు ఫంక్షన్హాల్లో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తాను భారత సైన్యంలో చేరి దేశ రక్షణ కోసం పని చేశానన్నారు. రాష్ట్రపతి దగ్గర ఉన్నత అధికారిగా పని చేసి అత్యున్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అలాంటి తనను విమర్శించే స్థాయి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు లేదన్నారు. నియోజకవర్గంలో తన హయాంలో చేసిన అభివృద్ధి ఏంటో వెనక్కి తిరిగి చూసుకోవాలని సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోదాడలోని లక్ష్మీపురం కాలనీలో అతిపెద్ద ఇందిరమ్మ కాలనీ నిర్మించినట్టు తెలిపారు. అవినీతి కోసం రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి రూ.5 కోట్లతో ఇల్లు ఎలా కడుతున్నావని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్‌ను ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు గురిచేస్తూ పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు మానుకొని నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఘనమైన చరిత్ర ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్నయాదవ్, రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, డీసీసీ ఉపాధ్యక్షుడు పారా సీతయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.