Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడున్నరేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా?
- కేసీఆర్ స్లీపింగ్.. కేటీఆర్ వర్కింగ్ :
రేవంత్‌రెడ్డి ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ప్లీనరీలో తెలంగాణ తల్లిని కాదనీ.. తెలుగు తల్లికి పెద్దపీట వేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల కోసమే వేదికపై తెలుగు తల్లిని పెట్టారని విమర్శించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, జగదీశ్, అధికార ప్రతినిధులు బెల్లయ్య నాయక్, అయోధ్యరెడ్డితో కలిసి సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాఓ మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలే పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ నేతల విగ్రహాలకు సైతం టీఆర్ఎస్ జెండాలను కట్టారని అన్నారు. ఆ పార్టీ ప్లీనరీలో తెలంగాణ అమరవీరులను స్మరించుకోలేదని ఎద్దేవా చేశారు. జలదృశ్యంలో మొదలైన టీఆర్ఎస్ ప్రస్థానం అవినీతి దృశ్యంగా, దోపిడీ దృశ్యంగా మారిందని ఆరోపించారు. ఈటెలను పార్టీ నుంచి బయటికి పంపాడనీ, హరీశ్‌రావును హుజూరాబాద్‌లో చెట్టుకు కట్టిండని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరి బొమ్మలే ప్లీనరీలో పెట్టుకున్నారని చెప్పారు. ఏడున్నరేండ్ల పాలనపై చర్చకు సిద్ధమా?అని ప్రశ్నించారు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు, స్కాలర్షిప్ల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఓయూకు ఎన్ని నిధులు కేటాయించారో చర్చకు సిద్ధమన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలను పట్టించుకోవడం లేదన్నారు. కమీషన్ల కోసం కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికీ నీరందలేదని చెప్పారు. పార్టీ కార్యాలయాల పేరుఓ కేసీఆర్ రూ.వెయ్యి కోట్ల ఆస్తులను సంపాదించారని ఆరోపించారు. ఫిక్స్డ్ డిపాజిట్ల రూ.420 కోట్లు ఉన్నాయనీ, ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి ఈ డబ్బు వచ్చిందని అన్నారు. దీనిపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిజాం నవాబులను తలదన్నేలా కేసీఆర్ వారసులు తయారయ్యారని చెప్పారు. ట్రాన్స్‌కో, జెన్కో ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం ప్రకటించాలని కోరారు. టీఆర్ఎస్ బైలాస్ మార్చారనీ, అంటే కేసీఆర్ స్లీపింగ్, కేటీఆర్ వర్కింగ్ అని భవిష్యత్ ముఖచిత్రం తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.