Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తేమను పరిగణనలోకి తీసుకోవద్దని రైతుల డిమాండ్
- మార్కెట్ గేట్లు మూసి అన్నదాతల రాస్తారోకో
- అధికారులతో చర్చలు ప్రారంభం
- తొలి రోజు మార్కెట్లో పత్తి ధర రూ.7970
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్ మార్కెట్లో తీవ్ర ప్రతిష్టంభన మధ్య పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన కొనుగోళ్ల పర్వం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఉదయం మార్కెట్లో పత్తి ధర నిర్ణయించిన తర్వాత తేమతో సంబంధం లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని రైతులు పట్టుబట్టడంతో సందిగ్ధం ఏర్పడింది. తేమ నిబంధనపై అధికారులు రైతులతో మూడు గంటలపాటు చర్చలు జరిపినా ఫలితం కనిపించలేదు. తేమ నిబంధన ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పంజాబ్చౌక్లో పాత జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. అంతకుముందు ఉదయం 9గంటల సమయంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ నటరాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, రైతుల సమక్షంలో ధర నిర్ణయించారు. తొలుత క్వింటాలుకు రూ.7920 ఖరారు చేశారు. అదే సమయంలో రైతులు తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని పట్టుబట్టారు. ఇందుకు వ్యాపారులు అంగీకరించకపోవడంతో కొనుగోళ్ల ప్రక్రియ నిలిచిపోయింది.
మధ్యాహ్నం 12.20గంటల వరకు అధికారులు, వ్యాపారులు, రైతుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమయంలో వ్యాపారులు క్వింటాలుకు మరో రూ.50 పెంచారు. దీంతో తొలిరోజు ఆదిలాబాద్లో పత్తి ధర క్వింటాల్ రూ.7970గా నిర్ణయించారు. కలెక్టర్ పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. కాంటాల వద్ద కొబ్బరికాయ కొట్టి కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించగా.. రైతులు తేమ నిబంధన విషయంలో పట్టువీడలేదు. కాంటాలను అడ్డుకొని మార్కెట్ గేట్లకు తాళం వేశారు. అక్కడ్నుంచి సమీపంలోని పాత జాతీయ రహదారిపె వెళ్లి రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. పోలీసులు నచ్చజెప్పినా రైతులు వినకుండా నిరసన కొనసాగించారు. సాయంత్రం సమయంలో అధికారులు మరోసారి రైతులతో చర్చలు జరిపారు. తేమ విషయంలో మార్కెట్, జిన్నింగ్లో బేరీజు వేసిన తర్వాత ఎక్కడ తక్కువ వస్తే దానిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. రైతులు ఎక్కడైనా పంట విక్రయించుకునే అవకాశం ఉందని, మార్కెట్ మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని హామీనిచ్చారు. దీంతో రైతులు పత్తిని విక్రయించడానికి అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది.