Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ స్టార్టప్ పాలసీతో అభివృద్ధిలో దూసుకుపోతుంటే కేంద్రంలో మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్యాకప్ పాలసీని అమలు చేస్తున్నదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. పరిపాలనా సంస్కరణలు, విద్యుత్, పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తీర్మానంపై ఆయన మాట్లాడారు. త్రీ ఐ అంటే ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూసివ్ గ్రోత్ అన్నారు. దీన్ని అమలు చేస్తే దేశం వేగంగా ముందుకు పోతుందని అభిప్రాయపడ్డారు. ఏడేండ్లలో అవినీతిని అరికట్టి పేదలకు సంక్షేమ పథకాలు అందేలా తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందంటూ వివరించారు. సమగ్ర కుటుంబ సర్వే దేశ చరిత్రలో ఒక సంచలన, చారిత్రక ఘట్టం అన్నారు. గతంలో ఈ రోజు బెంగాల్ ఆలోచించేది.. రేపు దేశం ఆలోచిస్తుంది అనేవారనీ, నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఇవాళ తెలంగాణలో జరిగేది.. రేపు దేశవ్యాప్తంగా జరుగుతుంది అనేలా.. సగర్వంగా విజయ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ మెరుగ్గా ఉందన్నారు. త్వరలోనే డిజిటల్ పద్ధతిలో సమగ్ర భూ సర్వే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. కేసీఆర్ అంటే కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు అంటున్నారని చెప్పారు. హైదరాబాద్ ఐటీకి బ్యాక్ బోన్ నిలుస్తున్నదని కొనియాడారు. హైదరాబాద్ గూగుల్‌కు గుండెవంటిదనీ, అమెజాన్, ఆపిల్‌కు ఆయువుపట్టు వంటిదని చెప్పారు. ఫార్మారంగంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదనీ, కరోనా టీకాల తయారీలో రాష్ట్రంలోని సంస్థలు ముందు వరుసలో ఉన్నాయన్నారు.