Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ముగిసిన వాదనలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నికల కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దళితబంధు పథకం అమలును నిలిపివేయడాన్ని సవాల్ చేసిన పిల్స్‌పై హైకోర్టు తీర్పు వాయిదా పడింది. సోమవారం ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిల డివిజన్ బెంచ్ చెప్పింది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విలేకరి మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్, హుజూరాబాద్ ఎన్నికలయ్యే వరకూ దళితబంధు పథకం అమలును నిలిపివేయాలని వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ వేసిన పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి.
'హుజురాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలును ఈసీ నిలుపుదల చేయడం సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు వ్యతిరేకం. ఎన్నికల తేదీలతో ఈసీ షెడ్యూల్ ప్రకటించేందుకు ముందే దళిత బంధు అమల్లో ఉంది. స్కీంను ప్రకటించే ముందు ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. క్యాబినెట్లో, అఖిలపక్ష పార్టీల సమావేశాల్లో చర్చలు జరిపింది. అమల్లో ఉన్న స్కీంను నిలుపుదల చేసే అధికారం ఈసీకి లేదు. రైతు భరోసా, రైతు బీమా వంటి స్కీంలు అమల్లో ఉండగా వాటికి లేని అభ్యంతరం దళితుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే దళితబంధును మాత్రమే ఎందుకు ఆపిందో ఈసీ చెప్పాలి. ఎన్నికల ముందు కేంద్రం పోషణ్ స్కీం పెడితే ఈసీ అభ్యంతరం చెప్పలేదు. 2019లో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు ఈసీ రాసిన లేఖలో పేర్కొన్న దాని ప్రకారం అమల్లో ఉన్న పథకాల కొనసాగింపునకు అడ్డులేదు. అయితే, దళితబంధు పథకం విషయంలో అందుకు విరుద్ధంగా చేసింది. హుజూరాబాద్ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ వెల్లడించేందుకు ముందు కేంద్రప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నట్టు ప్రకటించిన 'సుప్ర' పథకానికి ఈసీ అడ్డుచెప్పలేదు. ఈసీ దళితులకు అమలు చేసే స్కీం విషయంలో అభ్యంతరం చెప్పడం ద్వారా తప్పుడు సంకేతాలు జనానికి చేరేలా చేసింది. ఈసీ నిర్ణయాన్ని రద్దు చేయాలి. దళితబంధు అమలుకు ఉత్తర్వులివ్వాలి'అని మల్లేపల్లి లక్ష్మయ్య తరఫు న్యాయవాది రఘునాథ్ వాదించారు.
'హుజూరాబాద్ ఎన్నికలు అయిపోతే దళితబంధు అమలు అవుతుందో లేదో తెలియదు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు వరదలకు గృహాలు ముంపునకు గురైన బాధితులకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి కొందరికే ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నికలయ్యాక వరద బాధితుల విషయాన్ని మరిచిపోయింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలు అయ్యాక ప్రభుత్వం అదే చేస్తుంది. దళితబంధు అమలు చేయదు. ఇప్పటికే ఈసీ నిర్ణయాన్ని ఆక్షేపిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దళితబంధు స్కీం రాష్ట్రమంతా అమలు చేయాల్సి ఉంది. అందుకే ఈసీ నిర్ణయాన్ని రద్దు చేయాలి'అని జడ్సన్ తరఫు లాయర్ శరత్ వాదించారు.
'హుజూరాబాద్ ఎన్నికలు అయ్యే వరకూ దళితబంధు అమలును ఆపేయాలి. ఎందుకంటే అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేలా స్కీం ఉంది. రాజకీయంగా లబ్ధిపొందేందుకు దోహదపడేలా స్కీం ఉంది. కాబట్టి దళితబంధు పథకం అమలును నిలిపివేయాలి'అని వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ న్యాయవాది శశికిరణ్ వాదించారు.
'హుజూరాబాద్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని దళితబంధు అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ పథకం యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో అమలు జరిగింది. కొన్ని ఇతర ప్రాంతాల్లోనూ అమలవుతోంది. దీనిపై ఈసీ నిర్ణయం అన్యాయం. దళితబంధు అమలుకు ఉత్తర్వులివ్వాలి'అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచందర్‌రావు వాదించారు.
'హుజూరాబాద్‌లో మాత్రమే దళితబంధు అమలు చేస్తున్నారు. హుజూరాబాద్‌లోనే ఉప ఎన్నికలు జరగుతున్నాయి. అందుకే అమలు ఆపేశాం. రాజ్యాంగం ఇచ్చిన అధికారాల ప్రకారం ఈసీ అమల్లో ఉన్న స్కీంనూ అపేయొచ్చు. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ చర్యలు తీసుకుంటుంది. కొద్ది రోజులు ఆగితే స్కీం అమలుకు వీలుంటుంది'అని ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశారు చెప్పారు. అన్ని పక్షాల వాదనలూ విన్న తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.
దిశ హత్యాచార నిందితుల
కేసు తీర్పు వాయిదా : హైకోర్టు
దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిషన్ విచారణ తీరును సవాల్ చేసిన కేసుల్లో హైకోర్టు తీర్పు వాయిదా పడింది. కమిషన్ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ సీఐడీ డీఎస్పీ వి సురేందర్, బాచుపల్లి ఇన్స్పెక్టర్ కె నర్సింహారెడ్డిలు వేర్వేరుగా దాఖలు చేసిన రిట్లపై తీర్పును తర్వాత చెబుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్సీ శర్మ, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల డివిజన్ బెంచ్ సోమవారం ప్రకటించింది. ఇతర సాక్షులను విచారణ చేయకుండా తమను సాక్షులుగా విచారించేందుకు త్రిసభ్య కమిషన్ పిలవడం కిరణ్‌బేడి కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమనీ, ఇందిరాగాంధీపై పెట్టిన కేసులను విచారించిన షా కమిషన్ కేసులోని ఉత్తర్వులకు విరుద్ధమని వారి న్యాయవాదులు వాదించారు. సెక్షన్ 8 కింద స్వతంత్ర సాక్షులుగా పరిగణించేందుకు కమిషన్ అంగీకరించకపోవడం అన్యాయమన్నారు. కమిషన్ సాక్షులుగా ఉండేందుకు పిటిషనర్లు అంగీకరించడం లేదన్నారు. వాంగ్మూల నమోదు తర్వాత పిటిషనర్ల సాక్ష్యాలను నమోదు చేయాలన్నారు. వాదనల తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.