Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి/వెంకటాపురం
ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో సీపీఐ(మావోయిస్టు) పార్టీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు కీలక నేత మడివి హిడ్మా వైద్యం కోసం తెలంగాణకు వచ్చినట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసు అధికారులు సరిహద్దు అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా భారీ కూంబింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలిలో ఏకే-47 రైఫిల్, ఎస్ఎల్ఆర్ లభ్యమయ్యాయి. మృతుల్లో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా జారవేడ గ్రామానికి చెందిన ఏరియా కమిటీ సభ్యులు నరోటి దామాల్, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతంలోని మల్లిపాడు గ్రామానికి చెందిన పార్టీ సభ్యులు సోడి రామాల్, గంగులూర్ ప్రాంతంలోని పెద్దకోర్మ గ్రామానికి చెందిన పూనెం భద్రు ఉన్నారని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో ఏకే-47 లభించడంతో మృతుల్లో కీలకమైన నేత ఉన్నారా.. లేక ఎన్కౌంటర్ నేపథ్యంలో తప్పించుకోవడంలో ఆయుధాన్ని కోల్పోయి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులను పోలీసు అధికారులు గుర్తిస్తే సస్పెన్స్‌కు తెరపడే అవకాశముంది. కాగా, ఎన్‌కౌంటర్‌తో రెండు రాష్ట్రాల పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు.
బూటకపు ఎన్కౌంటర్ : జగన్
టేకులగూడెం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలు పక్కా సమాచారంతో మావోయిస్టు బలగాలను వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి బూటకపు ఎన్కౌంటర్ చేయగా ముగ్గురు మృతి చెందారని మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 27న బంద్ పాటించాలని విప్లవ శ్రేణులను, ప్రజలను, వ్యాపార వర్గాలను కోరారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముఖ్యమంత్రుల భేటీ అనంతరం సమాధాన్ దాడి లక్ష్యంలో భాగంగా సీఎం కేసీఆర్ రెట్టించిన ఉత్సాహంతో అణిచివేతకు పూనుకుంటున్నాడని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని స్పష్టం చేశారు.
తెలంగాణలో హై అలెర్ట్
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడంతో పాటు పలువురు మావోయిస్టులు గాయపడ్డారు. వారు వైద్యసేవల నిమిత్తం రాష్ట్ర సరిహద్దులోని పలు మండలాలకు వచ్చే అవకాశముండటంతో రాష్ట్ర పోలీసులు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించారు. వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాల్లో పోలీసులు ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు.