Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా మరోసారి సీఎం కే చంద్రశేఖరరావు ఎన్నికయ్యారు. ఆయన్ని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సోమవారం హైటెక్స్‌లో జరిగిన ఆపార్టీ ప్లీనరీలో ఆయన్ని అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యులు కే కేశవరావు ప్రకటించారు. అంతకుముందు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా పనిచేసిన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రక్రియను సభలో వివరించారు. అధ్యక్షుడిగా కేసీఆర్‌నే కొనసాగించాలని కోరుతూ 18 నామినేషన్లు దాఖలైనట్టు తెలిపారు. సభలో కేసీఆర్‌ను అధ్యక్షుడిగా ప్రకటించగానే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఆయనకు అభినందనలు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఖడ్గాన్ని కేసీఆర్‌కు బహూకరించారు. ఈ ఏకగ్రీవ ఎన్నికతో సీఎం కేసీఆర్ 9వసారి ఆపార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టయ్యింది. అనంతరం ఆయన మాట్లాడుతూ 2001లో జలదృశ్యంలో పార్టీ గులాబీ జెండాను ఆవిష్కరించినట్టు గుర్తుచేసుకున్నారు. అనేక అపనమ్మకాల మధ్య ఆ జెండా ఎగిరిందనీ, భారత స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితోనే తాము తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, విజయం సాధించామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలను నిర్దేశించిందనీ, ఇది శాశ్వత కీర్తి అని చెప్పారు. అంతకుముందు ఆయన తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. మూడేండ్ల కింద జరిగిన ప్లీనరీ నుంచి ఇప్పటి వరకు మరణించిన పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పిస్తూ, మౌనం పాటించారు.