Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సంక్షోభమంటూ అబద్ధపు ప్రచారం
- 160 గనులు ప్రయివేటుపరం
- కోల్ ఇండియాను అభాసుపాలు చేయడానికే...
- బొగ్గుగనుల చట్ట సవరణకు ముసాయిదా సిద్ధం: సీఐటీయూ జాతీయ కార్యదర్శి రామానందన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో బొగ్గు కొరత లేదనీ, అదంతా కార్పొరేట్ సంస్థలు, జాతీయ మీడియా చేసిన కుట్ర అని ఆలిండియా కోల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ జాతీయ కార్యదర్శి డిడి రామానందన్ విమర్శించారు. దేశం చీకటిమయం అవుతుందనీ, విద్యుత్ సంక్షోభం వస్తుందంటూ అబద్ధపు ప్రచారం చేశాయని చెప్పారు. 'బొగ్గు కొరత కారణాలు-పర్యవసానాలు'అనే అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ఆధ్వర్యంలో సోమవారం వెబినార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ బొగ్గుకు కృత్రిమ కొరత సృష్టించాయని వివరించారు. 2019-20లో కోవిడ్ ప్రభావం లేదనీ, సాధారణ పరిస్థితులున్న సమయంలో మార్చి 31 నాటికి దేశంలో 666 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని వివరించారు. 2020-21లో 596 మిలియన్ టన్నుల ఉత్పతి జరిగిందన్నారు. 2020, జనవరిలో 20 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తే, ఈ ఏడాది జనవరిలో 61 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యాయని అన్నారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం వంటి కారణాల వల్ల ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గును సేకరించలేదని గుర్తు చేశారు. అందుకే ఈ ఏడాది మార్చి నాటికి కోల్ ఇండియా వద్ద వంద మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని వివరించారు. అందుకే బొగ్గు ఉత్పత్తిని కోల్ ఇండియా నిలిపివేసిందని గుర్తు చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని గుజరాత్‌లోని అదానీ, టాటా వంటి ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బొగ్గు కొరత ఉందని కుట్రపూరితంగా ప్రచారం చేశాయని చెప్పారు. దేశం చీకటిమయం కాబోదనీ, విద్యుత్ సంక్షోభం రాదని స్పష్టం చేశారు. కోల్ ఇండియాను అభాసుపాలు చేసేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. దేశానికి ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి అవుతుందని చెప్పారు. దాన్ని ఎన్టీపీసీతోపాటు ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వాడతాయని వివరించారు. కరోనా నేపథ్యంలో ఏడాది కాలంగా బొగ్గు దిగుమతుల్లేవన్నారు. ఎన్టీపీసీకి కోల్ ఇండియా బొగ్గును సరఫరా చేసిందని అన్నారు. ఈ ఏడాది కాలంలో కోల్ ఇండియా వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.60 వేల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేసిందని వివరించారు. అదే బొగ్గును దిగుమతి చేసుకుని ఉంటే రూ.60 వేల కోట్లు కేంద్రం చెల్లించాల్సి ఉండేదనీ, దీన్ని మోడీ ప్రభుత్వం ప్రకటించడం లేదని చెప్పారు. ఇంకోవైపు ఇండోనేషియా బొగ్గు ధర టన్నుకు 60 డాలర్ల నుంచి 240 డాలర్లకు పెరిగిందని అన్నారు. వ విద్యుత్ ఉత్పత్తి వ్యయంగా మారిందనీ, ప్రభుత్వం కొనుగోలు చేసే యూనిట్ ధరను పెంచాలని ప్రయివేటు సంస్థలు ఒత్తిడి పెంచాయని చెప్పారు. దీంతో యూనిట్ విద్యుత్ ధరను రూ.9 నుంచి రూ.21కు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని గుర్తు చేశారు. దేశం చీకట్లోకి వెళ్తుందన్న తప్పుడు ప్రచారంతో యూనిట్ విద్యుత్ ధర రూ.12కు కార్పొరేట్ సంస్థలు పెంచాయని చెప్పారు. దీనివల్ల ఆ సంస్థలు రూ.12 వేల కోట్ల లాభాలు పొందాయన్నారు. కేంద్రం, విద్యుత్ శాఖ మంత్రి, హోంమంత్రి ఎక్కడా బొగ్గు కొరత ఉందని చెప్పలేదన్నారు. కానీ జాతీయ మీడియా, కార్పొరేట్ సంస్థలు కలిసి కుట్రపూరితంగా బొగ్గు కొరత ఉందనీ, దేశం చీకటిమయం అవుతుందని విస్తృతంగా ప్రచారం చేశాయని చెప్పారు.
ఇక బొగ్గు వ్యాపారం
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 160 బొగ్గు గనులను ప్రయివేటు సంస్థలకు అమ్మాలని కేంద్రంలోని బీజేపీ నిర్ణయించిందని రామానందన్ అన్నారు. మానిటైజేషన్ పైప్‌లైన్ ద్వారా రైల్వే, రోడ్లు, ఎయిరిండియా, ఎయిర్‌పోర్టుల తరహాలోనే బొగ్గుగనులు, సహజ సంపదను ప్రయివేటు పరం చేయాలని భావిస్తున్నదని వివరించారు. కోల్ ఇండియా బొగ్గును ఉత్పత్తి చేస్తే ప్రయివేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు. బొగ్గును నేరుగా ఉత్పత్తి చేసేందుకు ఆ సంస్థలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయని చెప్పారు. అందులో భాగంగానే బొగ్గు గనుల చట్టం-1957ను సవరించేందుకు ముసాయిదా బిల్లును రూపొందించిందనీ, దీన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించిందని గుర్తు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుపై రైతులు పెద్దఎత్తున ఆందోళన బాట పట్టారని వివరించారు. అందుకే బొగ్గు గనుల ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని గుర్తు చేశారు. బొగ్గు గనులున్న ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పర్యావరణ, రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ లైసెన్స్‌ల అనుమతులు పొంది ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు ఇవ్వాలన్నది ఆ బిల్లు ఉద్దేశమని చెప్పారు. ఇక బొగ్గు వ్యాపారం మొదలవుతుందని వివరించారు. బొగ్గు గనుల ప్రయివేటీకరణను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయనీ, కార్మికులను వదిలించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండబోదనీ మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వివరించారు. దీనికి వ్యతిరేకంగా కోల్ ఇండియాలోని కార్మిక సంఘాలు త్వరలో దీర్ఘకాలిక ఐక్య ఉద్యమాన్ని నిర్మించబోతున్నాయని చెప్పారు. బొగ్గుగనులు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనీ, కార్పొరేట్ సంస్థలు, జాతీయ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ విశ్లేషకులు కొండూరి వీరయ్య ఈ ప్రసంగాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.