Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలంటే మరీ చులకన
- సూటిపోటి, డబుల్ మీనింగ్ మాటలతో వేధింపులు
- ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై తరచూ అసభ్య పదజాలం
- జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్-29 డీసీ మోహన్‌రెడ్డి తీరుతో భయాందోళనకు గురవుతున్న ఉద్యోగులు
- కన్నీటి పర్యంతమైన మహిళా ఉద్యోగులు
- డీసీపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ-ఓయూ
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఎక్కడైనా హుందాగా ఉండాలి.. మాటల్లో చేతల్లో ఇతరులకు ఆదర్శంగా ఉండాలి.. కానీ జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్-29 డిప్యూటీ కమిషనర్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నారు. తనకు తానే 'మోనార్క్‌ను' అన్న టైపులో వ్యవహరిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను బండబూతులు తిట్టడం, అసభ్య పదజాల ప్రయోగం, డబుల్ మీనింగ్ డైలాగులతో మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారు. వేధింపులు భరించలేని మహిళా ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
ఏం జరిగిందంటే..
సోమవారం ఉదయం (అక్టోబర్ 25).. లాలాపేట్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో గ్రౌండ్ మెయింటెనెన్స్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ పనిచేస్తుండగా.. అక్కడికి డీసీ మోహన్‌రెడ్డి వచ్చారు. ఒక్కసారిగా నోటి దరుసును ప్రవర్శించారు. గ్రౌండ్లో మార్నింగ్ వాక్కు వచ్చినవారి ఎదుటే ఉద్యోగులపై బూతుపురాణం మొదలు పెట్టాడు. అక్కడున్న వర్కర్స్‌ను 'ఏడి మీ గ్రౌండ్ ఇన్చార్జి ఏడి?.. ఆ బండోడు ఎక్కడీ.. ఎక్కడ వాడు.. మిమ్మల్ని పండవెడ్తుండా (మూడుసార్లు). మీరు మహా పనిదొంగలు'' అంటూ మహిళా వర్కర్స్‌ను దూషించాడు. ఆయన మాటలకు కంగితిన్న వర్కర్స్ అంతా కన్నీటి పర్యంతమయ్యారు. తర్వాత గ్రౌండ్ ఇన్చార్జి కిరణ్‌తో జరిగిన విషయం చెప్పి బోరున విలపించారు.
''మేము లేబర్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు.. మా బతుకు మాది.. మా పని బాగా లేకుంటే ఎట్ట జేయాల్నో చెప్పాలి. కానీ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడ్తరా సారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా డీసీ మోహన్‌రెడ్డి ఇట్లనే ఎన్నోసార్లు మాట్లాడారని, ఆయనను చూస్తేనే తమకు భయం వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పని సరిగ్గా చేయలేదనుకుంటే ఎలా చేయాలో చెప్పాలి.. హెచ్చరించాలి.. నోటీసులు జారీ చేయవచ్చు కానీ బూతులు తిట్టడం దేనికి, లేబర్ అంటే చిన్న చూపా? ఔట్సోర్సింగ్ వర్కర్స్ ప్రశ్నిస్తున్నారు.
పనిముట్టు కూడా ఇవ్వరు
పురుషులతో సమానంగా తాము పనిచేస్తున్నామని, గ్రౌండ్లో వారితోపాటు గడ్డి చెక్కుతున్నామని, క్లీన్ చేస్తున్నామని మహిళలు చెప్పారు. పనిచేసేందుకు పనిముట్లు కూడా ఇవ్వడం లేదని, అరకొర జీతంలో నుంనే తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం 9 మంది పనిచేస్తున్నారు. అందులో ఆరుగురు మహిళలు, ముగ్గురు పురుషులు. నెలకు రూ.12 వేల జీతం అయితే.. అది కూడా సరిగ్గా రావడం లేదన్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోయినా.. ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయకుండా విధులు నిర్వహిస్తు న్నామని చెప్పారు. సిటీలో ఇతరచోట్ల గ్రౌండ్స్ మెయింటెనెన్స్ వర్కర్స్కు జీతాల విషయంలో ఇబ్బందుల్లేవని, నెల నెలా ఇస్తున్నారని తమకు మాత్రమే రెగ్యులర్‌గా ఇవ్వడం లేదని వాపోయారు. జీతాలు రాలేదని అడి గితే డీసీ మోహన్‌రెడ్డి ఎప్పుడూ తమ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతుం టారని, పైగా బూతులు మాట్లాడతారని, వేధిస్తున్నారని పలువురు మహిళా వర్కర్స్ చెప్పారు. నగర మేయర్, డిప్యూటీ మేయర్లు ఇద్దరే మహిళలు కావడం తమకు ఎంతో సంతోషకరమని, తమ బాధను అర్థం చేసుకుని డీసీ మోహన్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ''అవమానం తట్టుకోలేక, ఆత్మగౌరవాన్ని చంపుకోలేక 'నవతెలంగాణ'తో బాధ చెప్పుకుంటున్నాం.. ఈ వార్త వచ్చాక మాకు ఇంకా ఎటువంటి వేధింపులు ఉంటాయో.. డీసీ వేతనాలు ఇస్తారో లేదో భయంగా ఉంది.. అయినా ఆత్మగౌరవం కోసం మా బాధను వెల్లడించక తప్పడం లేదు.. మాకు న్యాయం చేయాలి'' అని మేయర్, డిప్యూటీ మేయర్లను, ఉన్నతాధికారులను వేడుకున్నారు.
జస్ట్ కోప్పడ్డానంతే..: డీసీ మోహన్‌రెడ్డి
వర్కర్స్్ను అసభ్యంగా తిట్డం, వేధించడం వంటి అంశాలపై వివరణ కోసం డీసీ మోహన్‌రెడ్డికి ఫోన్ చేయగా 'జస్ట్ కోప్పడ్డాను. అది కూడా మా వాళ్లు అన్న చొరవతో చేశాను.. బీజీగా ఉన్నా'' అంటూ ఫోన్ కట్ చేశారు.