Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి బెదిరింపు
- అరెస్టు చేయాలని ఎన్పీఆర్డీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుజరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయకుంటే వికలాంగుల పింఛన్లు కట్ చేస్తామని బెదిరించిన వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) గౌరవ అధ్యక్షులు జనార్దన్‌రెడ్డి, అధ్యక్షులు కె వెంకట్, ప్రధాన కార్యదర్శి ఎం అడివయ్య సోమవారం ఒకప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అంతదుగుల గ్రామంలో జరిగిన వికలాంగుల సమావేశంలో, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వికలాంగులంతా ఓటు వేయాలని చైర్మెన్ కోరారు. అంతటితో ఆగకుండా ఓటే వేయకపోతే.. పెన్షన్లు తీసేస్తామని ఆయన బహిరంగంగా వారిని బెదిరించారని తెలిపారు. వికలాంగులను తమ బాధ్యతలను అడ్డం పెట్టుకుని ఈ రకంగా బెదిరించటం అన్యాయమని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు భిన్నంగా వ్యవహరించిన చైర్మెన్ వాసుదేవరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. వికలాంగుల ప్రయోజనాల గురించి ఏ నాడూ మాట్లాడని ఆయన.. ఓట్లకోసం వారిని ప్రలోభాలకు గురిచేయాలని చూడటం ఎన్నికల నియమాలను ఉల్లంఘించటమేనని తెలిపారు. వారిపై బెదిరింపులకు పాల్పడిన వాసుదేవ రెడ్డిని పదవి నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 92 ఎ ప్రకారం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. వికలాంగులను కించపరిచే విధంగా వాసుదేవ రెడ్డి మాట్లాడి 24 గంటలు గడుస్తున్నా 2016 ఆర్పీడీ చట్టం కమిషనర్ ఎందుకు స్పందించలేదో తెలపాలని కోరారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి వికలాంగులను భయపెట్టిన ఆయనపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు.