Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రానికి నష్టం చేకూర్చే అంశాలపై తీర్మానాలేవి..?
- టీఆర్ఎస్ ప్లీనరీలో వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుల ఊసే లేని వైనం
- సహృదయంతో అర్థం చేసుకోవాలంటూ కేంద్రానికి వేడుకోలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'తెలంగాణ కోసం చావు నోట్లో తలకాయపెట్టినం. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదుర్కొని స్వరాష్ట్రాన్ని సాధించినం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తిరుగులేని రికార్డులు సాధించినం...' అధికార టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నొక్కి చెప్పిన మాటలివి. కానీ ఇక్కడే వారు ఒక అంశాన్ని విస్మరించారు. ఏ తెలంగాణ అభివృద్ధికైతే వ్యవసాయ, విద్యుత్ రంగాలు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయో, ఆయా రంగాలను దెబ్బతీసే విధంగా కేంద్రం తీసుకొస్తున్న వ్యవసాయ నల్ల చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లుల గురించి కేసీఆర్ ప్రసంగంలోగానీ, తీర్మానాల్లోగానీ ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం.
కొద్ది రోజుల క్రితం ముగిసిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో... 'ఇక కేంద్రంతో జగడమే, తాడో పేడో తేల్చుకుంటాం...' అంటూ సీఎం హెచ్చరించిన విషయం విదితమే. అందుకు భిన్నంగా ఇప్పుడు ప్లీనరీలో రాష్ట్రానికి నష్టం చేకూర్చే కీలకాంశాలపై గులాబీ పార్టీ మౌనం దాల్చటం విస్మయానికి గురి చేసే అంశం. తెలంగాణ కోసం 14 ఏండ్లపాటు పోరాటం చేసిన పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం చర్యలను సుతిమెత్తగా విమర్శించటంతో విమర్శకులు సైతం విస్తుబోతున్నారు.
'బహుళ పార్టీలు అధికారంలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సహృదయంతో అర్థం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలను విశ్వాసంలోకి తీసుకుంటూ సమాఖ్య స్ఫూర్తితో పాలన సాగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి కోరుకుంటున్నది...' అంటూ చివరి తీర్మానంలో పేర్కొనటాన్నిబట్టి మోడీ సర్కారు పట్ల కారు పార్టీ అనుసరిస్తున్న మెతక వైఖరి తేటతెల్లమవుతున్నది. గతంలో ఫెడరల్ ఫ్రంట్, రాష్ట్రాల హక్కులు, ఢిల్లీపై యుద్ధమంటూ వివిధ రాష్ట్రాలు తిరిగి, అక్కడి సీఎంలతో భేటీ అయిన కేసీఆర్... ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించటం కూడా పలు విమర్శలకు తావిస్తున్నది.