Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ గులాములం కాదు.. ప్రజాసంక్షేమమే ఎజెండా
- మేరకే స్వతంత్ర నిర్ణయాలు
- ఈసీ చిల్లరగా వ్యవహరించొద్దు
- దళితబంధు దేశాన్ని తట్టిలేపుతుంది..
- కిరికిరిగాళ్లు అప్పుడూ..ఇప్పుడూ ఉన్నారు
- వాళ్లతో వచ్చేదీ...సచ్చేదీ ఏమీ లేదు : టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఆర్ఎస్పార్టీకి ప్రజలే బాస్‌లు అనీ, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం స్వతంత్ర నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకుంటామని ఆపార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. ''కాంగ్రెస్, బీజేపీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అనేక ఏండ్లు పాలించాయి. ఇప్పుడు మేం ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మీరేగనుక ఇలాంటి పథకాలు పెడితే మేం చేయాల్సిన అవసరం ఏం వచ్చేది? మేం అమలు చేస్తున్నట్టు దళిత బంధు పథకాన్ని కాంగ్రెస్‌గానీ, బీజేపీగానీ అమలు చేయగలుగుతాయా? ఏ ఒక్క నిర్ణయాన్నయినా వారు స్వతంత్రించి తీసుకున్నారా? వారంతా ఇక్కడ గెలిచి, ఢిల్లీకి గులాం గిరీచేస్తారు. ఏదైనానిర్ణయం తీసుకుంటే దాన్ని దేశవ్యాప్తంగాఅమలు చేయాలనే డిమాండ్లు ఎక్కడ వస్తాయో అనే భయం వారి కుంటుంది. అందుకే ఏదన్నా అడిగితే 'చుప్' అని నోళ్లు మూయి స్తారు. కానీ టీఆర్ఎస్పార్టీ అందుకు పూర్తి భిన్నం. ప్రజలు కోరుకు నేదే చేస్తుంది. వారికి ఏది మంచో ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయా లు తీసుకుంటుంది. మేం ప్రజలకు తప్ప, ఎవరికీ జవా బుదారీ కాదు' అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ద్వి దశాబ్ది వేడుకలు, పార్టీ ప్లీనరీ మంగ ళవారంనాడిక్కడి హెచ్ఐసీసీలో జరిగాయి. కార్యక్రమ ప్రారంభంలోనే పార్టీ అధ్యక్షునిగా కే చంద్రశేఖరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆపార్టీ ఎన్నికల అధికారి శ్రీ నివాసరెడ్డి ప్రకటించారు. అనంతరం కేసీఆర్ మాట్లా డుతూ 20 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్తానాన్ని క్లుప్తంగా వివ రించారు. ఉద్యమాన్ని, స్వరాష్ట్ర సాధన, పరిపాలనలో భావోద్వే గాలను సమన్వయం చేసుకుంటూ సాగిన తీరును ఆయన చెప్పుకొచ్చారు. ''అప్పట్లో విపరీతమైన అపన మ్మక స్థితిలో గులాబీ జెండా జలదృశ్యంలో ఆవిష్క్రుత మైంది. శాంతియుత ఉద్యమం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొ న్నాం. రాష్ట్ర సాధన ఒక ఎత్తు అయితే...అధికారంలోకి వచ్చాక అప్పటి ఆకాంక్షలు, ఆలోచనలకు రూపకల్పన చేయడం సామాన్యమైన విషయం కాదు. సమైక్యవా దులు అనేక భయాలు సృష్టించి, నిందలు వేశారు. అయినా వెరవ కుండా ధైర్యంగా ముందుకే సాగాం'' అని చెప్పారు. ''కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన లెక్కల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉంది. వ్యవసాయంలో మీరు పండించే పంటను మేం కొనలేం అని భారత ఆహార సంస్థ (ఎఫ్ సీఐ) ప్రకటించేే స్థితికి వచ్చాం. ఒకప్పుడు వ్యవసాయమే దండగ అన్న నోళ్లే, ఇప్పుడు నోరెళ్లబెడు తున్నాయి. అదీ మన చిత్తశుద్ధి'' అనిఅన్నారు. ''దేశంలో నేతలసరి విద్యుత్ వినియోగంలో ముందున్నాం. తాగు, నీరు సాగునీరును సాధించుకున్నాం. ఏయే రంగాల్లో తెలంగాణా దెబ్బతింటుందని అపోహలు, భయాలు సృష్టించారో వాటిలోనే అభివృద్ధిని సాధించాం. మన పథకాలను పొరుగు రాష్ట్రాలు కాపీ కొట్టే స్థాయికి ఎదిగాం'' అని చెప్పారు. ''రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తమ దగ్గర కూడా అమలు చేయాలని తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల గ్రామాల ప్రజలు అక్కడి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నాందేడ్, రాయచూర్ తదితర ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇదీ ఇక్కడి సంక్షేమ పథకాల గొప్పతనం'' అని తెలిపారు. ''పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే, తామే గెలిపించుకుంటామని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇక్కడి పథకాలు అక్కడా కావాలని ఆకాంక్షిస్తున్నారు'' అని చెప్పారు. ''ఏండేండ్ల క్రితం వరకు అంధకారబంధురమైన తెలంగాణలో అన్నీ సమస్యలే. కానీ ఏడేండ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు ఇదీ నా తెలంగాణ అని తలెత్తుకుని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చాం'' అని స్పష్టం చేశారు. అయితే ఈ అభివృద్ధి ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాలేదన్నారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే ప్రజల ఆకాంక్షలు కార్యరూపంలోకి వచ్చాయన్నారు. ''రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల్లో అన్నింటా వైకుంఠధామాలు మొదలు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు కురిసినా మిషన్ కాకతీయ ఫలితంగా ఏ జిల్లాలోనూ ఒక్క చెరువూ తెగలేదు. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. పరిశ్రమలు, ఐటీరంగంలో పురోగతి సాధిస్తు న్నాం'' అని చెప్పారు. 'తెలంగాణ సమాజ అభివృద్దే తమ మతం అనీ, ప్రజల్లో చిరునవ్వే మన అభిమతమనీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ''ప్రతీక శక్తులు పురాణకాలం నుంచే ఉన్నాయి. ఆది నుంచీ అవి మనల్నీ ఇబ్బందిపెట్టాలనే చూశా యి. వాటన్నింటినీ ఛేదించుకొని ముందుకు సాగుతున్నాం. మొన్న ఢిల్లీ వెళ్లినప్పుడు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నన్నే స్వయంగా అడిగారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు'' అని అడిగారని చెప్పారు.
ఎన్టీఆర్ మాదిరే...
''వీఆర్వోలు రైతుల తలరాతులు తలకిందులుచేసే ప్రయత్నం చేస్తే, అప్పటి ఎన్టీఆర్ పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసినట్టే వీఆర్వోవ్యవస్థను రద్దు చేశాం. రైతుబంధు, రైతు బీమా అమల్లోకి తెచ్చి రైతుకు భరోసా కల్పించాం'' అని చెప్పారు. ''సింగరేణి కాలరీస్‌లో బోనస్ ఇస్తున్నాం. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఏ ఒక్క రాష్ట్రంలోనూ పెన్షన్లు లేవు. ఇక్కడ ఇస్తున్నాం'' అని తెలిపారు.
వాళ్లకు డిపాజిట్లూ లేవు
''అద్భుతమైన ప్రజా పునాది ఉన్న ఏకైకపార్టీ టీఆర్ఎస్. అనేక ఎన్నికలు చూస్తున్నాం. ఒకచోట కాంగ్రెస్‌కు, మరోచోట బీజేపీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. కానీ అన్నింటా గొప్పగా టీఆర్ఎస్ ప్రజామద్దతు కూడగట్టుకుం టున్నది'' అని చెప్పారు. తాము చేపట్టే పనులపై అనేక అనుమానాలు, అవరోధాలు ఉన్నా, ధృతి, ఉధృతితోనే ముందుకే సాగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విజయంలో అందరూ భాగస్వాములేనన్నారు.
2028నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.4.28 లక్షల కోట్లు
'మిగిలిన రెండేండ్లు, వచ్చే ఐదేండ్లు మేమే అధికారంలో ఉంటాం. ఈ ఏడేండ్లలో ప్రభుత్వ పథకాల కోసం రూ.23 లక్షల కోట్లను ఖర్చుపెడుతాం. 2028 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ.4.28 లక్షల కోట్లకు చేరుకుంటుంది. 2028 నాటికి తలసరి ఆదాయం రూ.7,76,000కు చేరబోతున్నది. ఏదో అల్లాటప్పాగా చెబుతున్న లెక్కలుగావు. ఆర్థికనిపుణులు తేల్చి చెబుతున్న లెక్కలు. ఇది మన ఉజ్వల ప్రస్థానం. కేంద్ర ఆర్థిక శాఖ నిష్ణాతులు లెక్కలువేసి చెప్తున్న అంకెలు ఇవి'' అన్నారు.
దళితబంధు చరిత్రను మారుస్తుంది..
వాళ్లకు ఆ ఆలోచనే తట్టలేదు..
''దళితబంధు ఒక పథకం కాదు. అదో ఉద్యమం. వందశాతం విజయం సాధిస్తామనే విశ్వాసం, నమ్మకముంది. పనులు చేయాలంటే ధైర్యం, స్థైర్యం కావాలి. ఈరోజు కూడా చేతకాని, చేవలేని ఇరుకైన ఆలోచనలు చేసే కొందరు కిరికిరిగాళ్లు దళితబంధుపై వ్యాఖ్యలు చేస్తున్నారు. దళితబంధు దేశాన్ని తట్టిలేపుతుంది. సమగ్ర కుటుంబసర్వేలో రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నట్టు లెక్క తేలింది. మరో ఒకటి రెండు లక్షలు అటూ ఇటూ ఉండొచ్చు. వారందరికీ ఆర్థిక ప్రయోజనం చేకూర్చి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామల్ని చేస్తాం. కచ్చితంగా దీని నుంచి అణగదొక్కబడిన వర్గాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తాయి. నిర్ధిష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాం. ఇన్నేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఆ దిశగా అసలు ఈ ఆలోచనే చేయలేదు. తూతూ మంత్రంగా ప్రజల్ని ఓటుబ్యాంకులుగా చూసుకున్నారే తప్ప, శాశ్వత చర్యలు చేపట్టలేదు. ఢిల్లీ బాస్‌లు సిట్ అంటే కూర్చుకుంటాయి. స్టాండ్ అంటే లేస్తాయి. టీఆర్ఎస్ అలా కాదు. బాస్‌లు లేరు. ప్రజలకు చెప్పింది చేసి తీరుతాం. దళితబంధుకు రూ. 1.70 లక్షల కోట్లు ఖర్చు చేస్తే, అది మరో పది లక్షల కోట్ల ఆస్తిని కూడబెడుతుంది. అది సంపదను సృష్టిబోతున్నది. గిరిజన, ఎంబీసీ, ఓసీల్లోని పేదలకు కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయగలుగుతాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి, యుక్తి టీఆర్ఎస్కే ఉంది' అని స్పష్టం చేశారు.
బలమైన ఆర్థికశక్తి ఉన్న పార్టీ
''దేశంలోని రాజకీయపార్టీల చరిత్ర, టీఆర్ఎస్తో పోల్చి చూడొచ్చు. మఖలో పుట్టింది...పుబ్బలో పోతుందని హేళన చేసినవాళ్లు ఉన్నారు. రూ.425 కోట్ల నిధి పార్టీకి ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉంది. దానిపై రూ.2 కోట్ల వడ్డీ వస్తోంది. 33 జిల్లాలకు గానూ 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు పూర్తయ్యాయి. మరో రెండు నిర్మాణంలో ఉన్నాయి. త్వరలో ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆఫీసులు ప్రారంభించుకుంటున్నాం. ఎవడో అరాకిలి గాళ్లు అడ్డం పొడువు మాట్లాడితే టీఆర్ఎస్ పార్టీ బెదిరిపోదు. సభ్యుల ఇన్సూరెన్స్ కోసమే ఏటా రూ.20 కోట్లు చెల్లిస్తున్న పార్టీ. ఆర్ధికంగా అత్యంత బలమైన పార్టీ. ఢిల్లీలోనూ పార్టీ ఆఫీస్ నిర్మించుకుంటున్నాం'' అని చెప్పారు.
ఈసీని హెచ్చరిస్తున్నా..రాజ్యాంగ వ్యవస్థగా నడుచుకోవాలి : కేసీఆర్
ఎన్నికల కమిషన్ చిల్లరమల్లర రాజకీయాలను మానుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ హెచ్చరించారు. 'భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధిని దాటుతున్నది. రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను.
చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలి' అని హెచ్చరించారు. 'కేసీఆర్ సభ పెట్టొద్దు ఇదేం కథ. ఇదీ ఓ పద్ధతేనా? సభను ఆపడం సబబేనా? కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ సభ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లోనూ సభ నిర్వహించొద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా ఏం కాదు. హుజూరాబాద్ పోరాటంలో మనోళ్లున్నారు. గెలుపు మనదే' అని కేసీఆర్ అన్నారు.
హుజూరాబాద్‌లో గెల్లు గెలుపు ఖాయం
'హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం. నవంబర్ 4 తర్వాత ఏ ఎన్నికల కమీషనూ దళితబంధును ఆపలేదు. వందశాతం అక్కడి దళితులందరికీ దాన్ని అమలు చేసి తీరతాం. మార్చి నాటికి ఈ స్కీం రాష్ట్రమంతా విస్తరిస్తుంది. నవంబర్, డిసెంబర్ నాటికి హుజూరాబాద్‌లో వందశాతం దళితబంధు అమలు కావాలే. జనవరిలో ఇతర జిల్లాల అధికారులు అదే నియోజకవర్గానికి 118 బస్సుల్లో వస్తారు. ఎలా సాధ్యమైందని మిమ్మల్నే అడిగి తెలుసుకుంటారు' అని సీఎం కేసీఆర్ అన్నారు.
''కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అద్భుత ప్రగతి సాధించామనీ, అడ్డదిడ్డంగా మాట్లాడేవారికి సమాధానం చెప్దామనీ అన్నారు. త్వరలో పార్టీ కార్యకర్తలకు 8, 9 నెలలు నిరంతర రాజకీయ శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.