Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువతి మృతి, యువకుడి ఆత్మాహత్యాయత్నం
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ఏడాది నుంచి ప్రేమించుకుంటున్న ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో లాడ్జ్‌లో యువతి మృతిచెంది ఉండగా, యువకుడు చిన్నచిన్న గాయాలతో ఏపీలోని ఒంగోలులో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చందానగర్ సీఐ క్యాష్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన కోటిరెడ్డి, ప్రకాశం జిల్లాకు చెందిన నాగచైతన్య (22) హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తుంది. గుంటూరుకు చెందిన కోటిరెడ్డి మెడికల్ రిప్రజెంటేటర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ ఆస్పత్రికి వెళ్లే క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. కాగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో నల్లగండ్లలోని ఎస్వీఆర్ ఓయో రూమ్ నెంబర్ 101లో దిగారు. మరుసటి రోజు ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పరిశీలించడంతో రక్తపు మడుగులో నాగచైతన్య మృతిచెంది ఉంది. కోటిరెడ్డి కత్తితో అమ్మాయి గొంతు కోసి హత్య చేసి పారిపోయి ఉంటాడని లాడ్జ్ మేనేజర్ 25న అర్ధరాత్రి సమయంలో చందానగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేయగా కోటిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్న, చిన్న గాయాలతో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదనీ, అందుకే చనిపోవాలని నిర్ణయం తీసుకొన్నామనీ, ఆమె గొంతు కోసుకోవడంతో భయంతో తాను వచ్చేశానని కోటిరెడ్డి పోలీసులకు తెలిపినట్టు సమాచారం. అయితే కులాలు వేరే అయినందువల్లే ప్రియురాలిని చంపి ఇక్కడ నుంచి అక్కడికి పారిపోయాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.