Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన,ప్రజా సంఘాల డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు దరఖాస్తులకు రాష్ట్ర స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ గిరిజన, ఆదివాసీ,రైతు, వ్యవసాయ కార్మికసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మంగళవారం హైదరాబాద్లోని రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం ధర్మానాయక్, ఆర్ శ్రీరాంనాయక్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, ఉపాద్యక్షులు పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగు దారులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే షెడ్యూల్ నోటిఫికేషన్ను జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రం మొత్తానికి ఒకే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అఖిలపక్ష పార్టీలు, గిరిజన, ప్రజాసంఘాల పోరాటాల ఫలితంగా పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ నెల ఎనిమిది నుంచి స్వీకరించనున్న ధరఖాస్తుల నోటిఫికేషన్ షెడ్యూల్ను జిల్లా కలెక్టర్లద్వారా విడుదల చేయడం సరికాదని సూచించారు. ఇలాంటి అవకాశం కల్పించడం ద్వారా నోటిఫికేషన్ను కొన్ని జిల్లాలకు వేయకుండా కాలయాపన చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల సమస్య రాష్ట్రంలో ఎక్కడున్నా దరఖాస్తులు పెట్టుకునే అవకాశం కల్పించాలని కోరారు. అడవి మధ్యలో పోడు భూములను సాగు చేస్తున్న వారిని ఏదో ఒక సాకుతో అక్కడి నుంచి తరలించడమనేది అటవీ హక్కుల చట్టం స్పూర్తికి భిన్నమైందని గుర్తుచేశారు. ఐదో షడ్యూల్, అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇప్పుడున్న అటవీ గ్రామాలను తరలించడాన్ని అంగీకరించదని చెప్పారు. వాటిని రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం ఇంకా ఏడు లక్షల ఎకరాలకుపైగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉందంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.