Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎం కార్యాలయం ఎదుట సీఐటీయూ ధర్నా
- నాయకులు, కార్మిక కుటుంబీకుల అరెస్ట్
నవతెలంగాణ - గోదావరిఖని:
సింగరేణిలో పనిచేసి ప్రమాదంలో, కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరధిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట కార్మికుల కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి మాట్లాడారు.
సింగరేణిలో మరణించిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులు న్యాయం కోసం 18 నెలలుగా వివిధ రూపాల్లో వినతులు, ఆందోళనలు చేస్తున్నా యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేస్తుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రెండు కండ్లు కోల్పోయిన కార్మికుడిని సైతం బలవంతంగా జీపులో తోసేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ధర్నా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోకుండా, సమస్య వినకుండా దుర్భాషలాడుతూ బాధిత కుటుంబ సభ్యులను, సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం సరికాదన్నారు. మీడియా ప్రతినిధులు పోలీసు స్టేషన్కు వచ్చి అరెస్టు అయిన కార్మిక కుటుంబ సభ్యులతో, నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. వారిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ఎలా అణగదొక్కబడుతున్నదో స్పష్టమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు విజిలెన్స్ వారోత్సవాలకు ఇచ్చిన ప్రాముఖ్యత మరణించిన కాంట్రాక్టు కార్మిక కుటుంబాలకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆగదని, యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.శ్రీనివాస్, మహేష్, సత్యనారాయణ, సతీశ్, రాజమొగిలి, కార్మికుల కుటుంబ సభ్యులు రమేష్, రవీందర్, వెంకటేష్, విలాసిని, శ్రావణి, సౌజన్య పాల్గొన్నారు.a