Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ఈఎన్సీ మురళీధర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏపీ ప్రభుత్వ తీరుతో తెలంగాణలోని కష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని కేఆర్ఎంబీ చైర్మెన్‌కు తెలంగాణ సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.మురళీధర్ లేఖ రాశారు. సాగర్ ఎడమ కాలువను ఇష్టారీతిగా పెంచుకున్నారని విమర్శించారు. పూర్తిస్థాయి ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్)ను గత ప్రభుత్వాలు ఖాతరు చేయలేదన్నారు. ఏపీ చేపట్టిన పిన్నపురం ప్రాజెక్టును ఆపాలని బోర్డును గతంలో కోరామనీ, ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని గుర్తు చేశారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీల నీరే తీసుకోవాలని సూచించారు. కాగా పోతిరెడ్డిపాడు ద్వారా బేసిన్ అవతలకు ఏపీ భారీగా నీరు తరలిస్తున్నదని లేఖలో తెలియజేశారు. ఈనేపథ్యంలో తెలంగాణలోని కష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు
లేఖలోని ముఖ్యాంశాలు
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి ఎత్తిపోసిన నీటితో చేపట్టిన పిన్నపురం హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టును వెంటనే ఆపమని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసినా కష్ణా బోర్డ్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు.
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నార్ బేసిన్లో ఇటువంటి నాలుగు పంపింగ్ స్టోరేజీ హైడల్ ప్రాజెక్టులను కడప జిల్లా గండికోట, అనంతపురం జిల్లా చిత్రావతి, నెల్లూరు జిల్లా సోమశిల, కర్నూల్ జిల్లా అవుకులో నిర్మించింది.
3. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీటికి పనులు చేపట్టడానికి కేఆర్ఎంబి నుంచి కానీ, ఆపెక్స్ కౌన్సిల్ నుంచి గాని అనుమతులు పొందలేదు.
4. హైడల్ ప్రాజెక్టులన్నీ కూడా కష్ణానది నుంచి ఎత్తిపోసిన నీటి ఆధారంగానే ప్రతిపాదించడం జరిగింది. లోటు బేసిన్ అయిన కష్ణా బేసిన్ నుంచి పెన్నార్ బేసిన్‌కి ఎత్తిపోసి, అక్కడ జలాశయాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతున్నది. శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 34 టి.ఎం.సి లు (15 టి.ఎం.సి లు చెన్నై తాగునీటికి 19 టి.ఎం.సి లు శ్రీశైలం కుడి కాలువకు) మాత్రమే తరలించాలి. కానీ పోతిరెడ్డిపాడు ద్వారా, దాని కింద ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ ద్వారా భారీగా నీటిని ఎత్తిపోసి, ఆయా రిజర్వాయర్ల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో తెలంగాణలో ఉన్న బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరగనున్నది.
5. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబీ నుంచి కానీ, ఆపెక్స్ కౌన్సిల్ నుంచి గాని ఈ విషయమై అనుమతులు పొందని చిత్రావతి పంపింగ్ స్టోరేజీ హైడల్ ప్రాజెక్టులను, ఇలాంటి ఇతర ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయించాలని కేఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దష్టికి ఈ సమస్యలను తీసుకుపోవాల్సిందిగా కోరారు.