Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో పేదవారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యమందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు,భవనాలు,గహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందులో భాగంగా యుద్ధప్రాతిపదికన వైద్యపరమైన మౌళిక సదుపాయాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు మంగళవారం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్‌లతో మంత్రి భేటి అయ్యారు. ఈ సందర్భంగా రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన పలు హాస్పిటళ్లు, మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణాలకు సంబంధించిన ఆర్కిటెక్ట్‌లు రూపొందించిన డిజైన్ ప్లాన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులతో కలిసి పరిశీలించారు. కొత్తగా వరంగల్ లో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్ నగరం నలువైపులా 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు, నిమ్స్ హాస్పిటల్ విస్తరణ, సంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, రామగుండంలో నిర్మించే మొత్తం 8 కొత్త మెడికల్ కాలేజీలు డిజైన్లను మంత్రి, ఉన్నతాధికారులు పరిశీలించారు. అలాగే సంగారెడ్డి, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, నల్లగొండ,మహబూ బ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, గద్వాల, బాన్సువాడలో నిర్మించే మొత్తం 14నర్సింగ్ కాలేజీల నిర్మాణ డిజైన్యూ తిలకించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా డిజైన్లలో స్వల్ప మార్పులు సూచించారు. తర్వాతి సమావేశం నాటికి డిజైన్ ప్లాన్లను ముఖ్యమంత్రి సమర్పించడానికి సిద్ధం చేయాలని ఆర్కిటెక్ట్‌లను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్,హెల్త్ సెక్రటరీ రిజ్వీ, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, ఆర్ అండ్ బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఐ. గణపతిరెడ్డి, టీఎస్ఎండీసీ ఎం.డి చంద్రశేఖర్‌రెడ్డి, రాజేందర్, వైద్యఆరోగ్యశాఖ ఓఎస్డీ గంగాధర్ పలువురు అధికారులు, హైదరాబాద్‌కు చెందిన పలు ఆర్కిటెక్ట్ కన్సల్టెన్సీ ప్రతినిధులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ పాల్గొన్నారు.