Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరికి బదులు మార్కెట్ డిమాండ్ పంటలు వేయాలి
- వానా కాలం ధాన్యం సేకరణకు ఏర్పాట్లు : విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయప్రతినిధి
యాసంగిలో ఒక్క వరి గింజ కూడా కొనే పరిస్థితి లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కలిగించాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ, సహకార శాఖ, పోలీస్ శాఖల అధికారులు, మిల్లర్లతో మంత్రి యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వచ్చే యాసంగిలో వరి కొనుగోలు చేసే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసినందున రైతులను మార్కెట్లో ధర లభించే ఇతర పంట సాగువైపు చైతన్య వంతం చేయాలన్నారు. కేంద్ర సంస్థలు ఎఫ్‌సీఐ వరి కొనుగోలు చేసే పరిస్థితి లేదని, ఇప్పటికే గోదాంలలో మూడేండ్లకు సరిపడా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. యాసంగిలో ఒక్క గింజ కొనే పరిస్థితి లేదని వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు మండల వ్యవసాయ అధికారులు పంటల సాగుపై ప్రణాళికలను తయారు చేయాలని, యాసంగి సీజన్లో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్, మినుములు, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పెసర తదితర పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మినుములను మద్దతు ధరకు నాఫెడ్ సంస్థ కొనుగోలు చేస్తుందని, ఆ పంట సాగును ప్రోత్సహించాలని చెప్పారు. భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు పండించేలా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, డీఐజీ ఏ.వి.రంగనాథ్, అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్, అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, ఎన్.భాస్కర్ రావు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.