Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క
- రైతుకూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎస్వీకే వద్ద నిరసన
నవతెలంగాణ-ముషీరాబాద్
వరి పంట సాగుపై ఆంక్షలు ఎత్తేయాలని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత, ప్రజా గాయకురాలు విమలక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టర్ వరి పంటపై చేసిన వ్యాఖ్యలపై మంగళవారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రైతుకూలీ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వ్యవసాయ శాఖ అధికారులతో చేసిన వరి పంటపై సమీక్షా సమావేశంలో.. వరి సాగును నిషేధిస్తున్నట్టు ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించడం సరైంది కాదన్నారు. వరి పంట నిషేధానికి ఏ జీవో అక్కర్లేదని తన కార్యనిర్వాహక బాధ్యతల పరిధి దాటి హెచ్చరికలు చేయడం నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కోట్లాది రూపాయల ఖర్చుతో కట్టిన ప్రాజెక్టుల మధ్య నీటి వసతి అధికంగా ఉన్న సిద్దిపేట ప్రాంతంలో ఏ పంటలు పండించాలో.. ఏ ప్రత్యామ్నాయానికి అనుకూలంగా ఉంటుందో శాస్త్రీయమైన పరిశోధనలు జరిపి తేల్చాల్సిన అంశాన్ని సింపుల్గా చెప్పడం సరైంది కాదన్నారు. వరి పంటకు సంబంధించిన విధాన నిర్ణయాలు ప్రభుత్వం వెల్లడించాలని, అందుకు అన్ని రైతు సంఘాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ చొరవచూపి అఖిలపక్ష సమావేశం జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుకూలీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పటోళ్ల నాగిరెడ్డి, పీడీఎస్యూ విజృంభన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్సూర్, పీడీఎస్యూ నాయకులు అల్లూరి విజరు, శంకర్, అనిల్, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.