Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
వరి విత్తన డీలర్లకు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒక్క వరి విత్తనం రైతుకు అమ్మినట్టు తెలిసినా వెంటనే ఆ షాప్‌ను సీజ్ చేసేస్తానని హెచ్చరించడం వివాదాస్పదమైంది. సీజ్ చేసిన షాపులను తెరిపించాలని సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా.. తాను కలెక్టర్‌గా ఉన్నంతకాలం ఒప్పుకునేదే లేదని వ్యాఖ్యానించడం పట్ల ప్రతిపక్ష పార్టీల నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ వెంకట్రామిరెడ్డి.. యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు.. డీలర్ల పాత్ర తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీలర్లను, అధికారునుద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. డీలర్లు రైతులకు వరి విత్తనాలు అమ్మితే ఆ షాప్‌ను సీజ్ చేస్తామని.. వరి విత్తనాలు అమ్మినట్టు తేలితే.. ఆ పరిధిలోని ఏఈవోలను, అగ్రికల్చర్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. డీలర్లు తప్పు మీద తప్పు చేస్తే చండాడి.. వెంటాడుతానన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో వైరల్ కావడంతో కలెక్టర్ స్పందించారు. తన మాటలను కొంతమంది ఉద్దేశపూ ర్వంగా వక్రీకరించి.. సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను, అర్ధసత్యాలను ప్రచారం చేయడం సరికాదని కలెక్టర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రైతుకు స్వేచ్ఛ లేదా?
సొంత నిర్ణయంతో రైతులు తమ భూమిలో ఏ పంట వేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదా.. ఏ పంట వేయాలో సిద్దిపేట కలెక్టర్‌ను అడిగి వేసుకోవాలా?. రైతులను శాసించేలా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పకపోతే.. కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం. కలెక్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
-సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి
మల్లన్నసాగర్ నీళ్లు ప్రగతిభవన్‌లో పోసుకుంటారా
రైతులు వరి వేయకుంటే.. మల్లన్నసాగర్ నుంచి లిఫ్ట్ చేసి తెచ్చిన నీళ్లు ప్రగతి భవన్లో పోసుకుంటారా?.. ముఖ్యమంత్రి ఆదేశాలతో 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్‌తో 20 గ్రామాలను ముంచేసి ప్రజలను నిర్వాసితులను చేసిన సిద్ధిపేట కలెక్టర్.. ఇప్పుడు వరి విత్తనాలు అమ్మితే శిక్షిస్తానని ఎలా వార్నింగ్ ఇస్తున్నారు.
-బీఎస్పీ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
సిద్దిపేట కలెక్టర్ రైతులకు క్షమాపణ చెప్పాలి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్
రైతుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఉపసంహరించుకోవాలి. రైతులకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. ''వరి విత్తనాలు అమ్మొద్దు. అమ్మితే షాపులు మూసేస్తాం. కలెక్టర్‌గా తానున్నంతకాలం వరి విత్తనాలు అమ్మేది లేదు'' అని కలెక్టర్ వ్యాఖ్యలు చేయడం సరిగాదు. ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పినా పట్టించుకోననీ, సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డర్లను కూడా లెక్కచేయబోనని కలెక్టర్ స్థాయి వ్యక్తి మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం తగదు. వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు కట్టడం ఎందుకు? చెప్పిన పంటలు వేయాలని బెదిరించడం చాలా అన్యాయం. వరి వేస్తే ఉరి అని ప్రచారం చేయడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌పై చర్యలు తీసుకుని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.