Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రభుత్వం హడావుడి
- 'యాసంగిలో వరి వద్దంటూ రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
- వరి విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని కలెక్టర్ల హెచ్చరిక
- మాగాణిలో మెట్ట పంటల సాగు ఎలా సాధ్యమని రైతుల ప్రశ్న
- ప్రణాళిక లేమితో ముందుకెళ్తుండటంపై రైతు సంఘాల అభ్యంతరం
నవతెలంగాణ- ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధులు
కోటి ఎకరాల మాగాణం.. కోతలే తప్ప రైతుల వ్యథలు తీర్చలేదని.. ఆంధ్రాను మించిన అన్నపూర్ణ.. పంజాబ్ తర్వాత దేశంలో అతి ఎక్కువగా వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం మనదేనని.. ప్రభుత్వ పెద్దల ప్రగల్భాలు నీటిమూటలని తేలింది. వరికి ఉరి ఖాయమవడంతో మాగాణి రైతు గగ్గోలు పెడుతున్నాడు. ఓ ప్రణాళిక లేకుండా రాత్రికి రాత్రే.. ''యాసంగిలో వరి వద్దు.. ప్రత్యామ్నాయ పంటలు పండించండి'' అంటే ఎలా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆరుతడికి అనువైన పరిస్థితులు, సరిపడా ఆ పంటల విత్తనాలు, మెట్ట పంటలు పండించాక గిట్టుబాటు ధరలు.. వీటిపై స్పష్టతనివ్వకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విషయంలో చేస్తున్న హడావుడిపై రైతులు, రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు.. వ్యవసాయ, ఉద్యాన, పట్టుశాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి వరి విత్తనాలు అమ్మితే లైసెన్స్ రద్దు చేస్తామని డీలర్లకు హెచ్చరికలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా రైతాంగం వరి సాగు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 2,26,156 ఎకరాల్లో యాసంగి వరి సాగవుతుందని అంచనా. దీనిలో 12.57% అంటే 28,426 ఎకరాల్లో మెట్ట పంటలు సేద్యం చేయించాలని భావించారు. కానీ కలెక్టర్ల సమావేశం తర్వాత ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. జిల్లాలో 2.26 లక్షల ఎకరాలతో పాటు చెరువుల కింద ఉన్న మరో 80వేల ఎకరాల్లో యాసంగి వరి సాగవుతుంది. కానీ కేవలం 28,426 ఎకరాల్లోనే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే మిగిలిన భూసేద్యం సంగతేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ రైతుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గతేడాది మొత్తం 5,73,620 ఎకరాల్లో వరి సాగు అయ్యింది. ఈ యేడాది ఇన్ని లక్షల ఎకరాల్లో సాగయ్యే ఇతర పంటలకు విత్తనాలు ఎలా సమకూర్చుతారన్న ప్రశ్నకు సర్కారు వద్ద సమాధానం లేదు. నిజామాబాద్ జిల్లాలో నవంబర్ రెండోవారం నుంచి రైతులు నారుమడి సిద్ధం చేసుకుని చివరి వారం నుంచి నాట్లు వేయడం ప్రారంభిస్తారు. కేవలం రెండు వారాల ముందు రైతులకు వరి సాగు చేయొద్దని చెప్పడంతో రైతులు సైతం అయోమయంలో పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ వద్ద ప్రస్తుతం 77,486 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 54,436 క్వింటాళ్ల వరకు వరి విత్తనాలే ఉన్నాయి. ఇక 22,593 క్వింటాళ్ల శెనగ విత్తనాలున్నాయి. మిగతా 457 క్వింటాళ్లలో పెసర్లు, మినుములు, ఎర్రజొన్న, నవ్వులు, సజ్జలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్న సర్కారు.. అందుకు సంబంధించి ఇప్పటివరకు విత్తనాల విషయంలోనూ కసరత్తు చేయలేదు.
'ప్రత్యామ్నాయం' సరే ప్రణాళికేది?
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని చెబుతున్న సర్కారు.. అందుకు సంబంధించి ఇప్పటివరకు విత్తనాలు, తదితర విషయాలపై ఎలాంటి కసరత్తు చేయలేదు. ఒకవేళ రైతాంగాన్ని ఆరుతడి పంటల వైపు మళ్లించాలని ప్రభుత్వం ముందునుంచి అనుకుంటే ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలు విత్తుకునేలా చర్యలు చేపట్టాల్సింది. జల వనరులు పుష్కలంగా ఉన్న ఆయా జిల్లాల్లో మూడొంతుల మాగాణి భూముల్లో ఆరుతడి పంటలు సాగు చేయాలంటే అందుకు సరిపడా విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తుందా? వాటికి సబ్సిడీ ఇస్తుందా? భూసారానికి అనుగుణంగా పంటలు సేద్యం చేయాలని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కానీ మాగాణిలో మెట్ట పంటలు ఎంతమేరకు ఫలప్రదం అవుతాయనే సందేహాలు నెలకొన్నాయి. వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం వేరుశనగ, శనగ, ఆవాలు, ఆముదము తదితర పంటలు విత్తుకోవడానికి నవంబర్ రెండో వారం వరకు అనుకూల సమయం ఉంది. కానీ జిల్లాల్లో నువ్వులు, పొద్దుతిరుగుడు, కుసుమ తదితర పంటలకు సంబంధించి కూడా అటు ప్రభుత్వం, ఇటు ప్రయివేటు ఏజెన్సీల వద్ద ప్రస్తుతానికి స్టాక్ లేదు. ఇప్పటికిప్పుడు లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఎలా అందుబాటులోకి వస్తాయి. సీడ్స్ లభ్యతపై ఓ సంవత్సరానికి ముందే ప్రణాళిక ఉండాలి. తెలంగాణ సీడ్స్‌లో పెసలు, మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇవి ఎంత మేరకు నాణ్యమైనవనే ప్రశ్న తలెత్తుతోంది. ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో రైతులు సరిహద్దు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వరి విత్తనాలు తెచ్చుకుని సాగు చేస్తే పరిస్థితి ఏంటి? అసలు విత్తన డీలర్లపై చర్యలు తీసుకోవడం ఎంత వరకు సబబు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు రైతులు, రైతుసంఘాల నుంచి ఉత్పన్నమవుతున్నాయి. స్పష్టమైన ప్రణాళిక లేకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు సోమవారం సమావేశం నిర్వహించడంపై విమర్శలు రావడంతో సర్కారు సందిగ్ధంలో పడింది.
ముందు చేయాల్సిన పని వెనుక..
వాస్తవానికి క్షేత్రస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై ఆలోచన చేయాలి. కానీ ప్రభుత్వ హడావుడితో మాగాణి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రైతుల నుంచి గ్రామాలు, మండలాలు, క్లస్టర్ల వారీగా సమాచారం తీసుకుని ఆ మేరకు ప్రణాళిక రూపొందించాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి జిల్లా వ్యవసాయశాఖలకు ఆదేశాలు అందాయి. ప్రత్యామ్నాయ పంటల సాగు.. క్షేత్రస్థాయి పరిస్థితులపై అంచనా వేసి దానికి తగినట్టు ఓ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికిప్పుడు ప్రణాళికలు రూపొందించి లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంట సాగు సాధ్యం కాదు కాబట్టి ఎలా అయినా రైతులు వరి సాగు చేస్తారని ప్రభుత్వానికి తెలుసని రైతులు, రైతుసంఘాలు అంటున్నాయి. పంట ఉత్పత్తి అయిన తరువాత కొనుగోలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దన్న ఉద్దేశ్యంతో ఈ ప్రచారం ముందుకు తీసుకొచ్చిందని చెబుతున్నారు.
విత్తనాల కొరత తలెత్తొద్దు.. గిట్టుబాటు ధర ఇవ్వాలి..
'ప్రత్యామ్నాయ పంటల సాగు విషయంలో ప్రభుత్వం హడావుడి చేస్తూ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రత్యామ్నాయ పంటల్లోని మినుములు, బొబ్బర్లు, పెసలు, పొద్దుతిరుగుడు తదితర విత్తనాల కొరత ఉంది. జిల్లాలో మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వరి ఎక్కువగా సేద్యం అవుతోంది. మొత్తం 15 మండలాలు పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. కాబట్టి అక్కడి నుంచి రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేస్తారు. వ్యవసాయశాఖపై బాధ్యత పెట్టి వారిని నిందించడం కాదు. రైతులందరికీ సరిపడా సబ్సిడీతో మెట్టపంట విత్తనాలు సరఫరా చేయాలి. పంటలు పండించాక గిట్టుబాటు ధర ఇవ్వాలి. ప్రభుత్వమే ఈ మేరకు రైతులకు హామీ ఇవ్వాలి.
- మాదినేని రమేష్, తెలంగాణ రైతుసంఘం జిల్లా కార్యదర్శి
సమావేశం వాయిదా పడింది
ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను సమాయత్తం చేస్తూ రాష్ట్రస్థాయిలో నిర్వహించాల్సిన సమావేశం వాయిదా పడింది. కలెక్టర్‌తో సోమవారం నిర్వహించిన సమావేశంలో విత్తన డీలర్లకు మార్గదర్శకాలు చేశారు. మెట్టపంటల విత్తనాలు విక్రయించాలని సూచించారు. గతంలో రూపొందించిన ప్రణాళిక కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకెళ్తాం.
- ఎం. విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయశాఖ అధికారి
రైతుకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
కలెక్టర్‌తో సోమవారం జరిగిన సమావేశంలో ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను నడిపించేందుకు విత్తన డీలర్లు సహకరించాలని సూచించారు. వరిని ప్రోత్సహించొద్దన్నారు. తప్పు చేస్తే తప్ప లైసెన్స్ రద్దు చేసే అధికారం ఎవరికీ లేదు. రైతుకు భరోసా కలగాలంటే నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉండేలా చూడాలని సమావేశంలో మేము కలెక్టర్ గారిని కోరాం.
- రామడుగు మనోహర్‌రావు,
విత్తన డీలర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి
ప్రతిపాదనలు పంపుతాం :
గోవింద్, నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో ఏయే పంటలు సాగు చేస్తారు.. ఏ విత్తనాలు అవసరం అనే అంశాలపై చర్యలు చేపట్టాం. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతుల నుంచి వివరాలు సేకరించి అవసరమైన విత్తనాల ప్రతిపాదనలను రాష్ట్ర సర్కారుకు నివేదిస్తాం.