Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదమని ఆందోళన
- అయోమయంలో కార్మికులు
నవతెలంగాణ-మణుగూరు
సిరుల తల్లి సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకుల వేలానికి సిద్ధం చేసింది. ఈ కారణంగా మణుగూరులోని కార్మికులు సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓసీ 4 ఉపరితల గని వేలం పాటలో ఓ ప్రయివేటు సంస్థ సొంతం చేసుకుందని మణుగూరు సబ్‌డివిజన్‌లో కలకలం ప్రారంభమైంది. ఓసీ 4లో పనిచేసే పర్మినెంట్ కార్మికులు తమ భవిష్యత్ ఏంటని మదనపడు తున్నారు. ట్రాన్స్ఫర్ చేస్తారా మణుగూరులోనే ఆయా గనుల్లో భర్తీ చేసేందుకు యాజమాన్యం ప్రయత్నిస్తున్నదని కొంతమంది అధికారులు, కార్మికసంఘాల నాయకులు ఎవరికితోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. కార్మికులు మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సంస్థ 130 ఏండ్ల చరిత్ర ఉన్న సింగరేణి ఆధీనంలోనే గనుల కార్యకలాపాలు కొనసాగుతు న్నాయి. గతంలో తాడిచర్ల బ్లాకును ప్రభుత్వరంగ సంస్థ జెన్కో అవసరాల కోసం కేటాయించింది.
ఆ తర్వాత రాష్ట్ర ఆవిర్బావం అనంతరం కొత్త గనుల అన్వేషణ, ఉపాధి అవకాశాల పెంపు కోసం 20 ఓపెన్ కాస్ట్‌లు, 11 భూగర్భ గనులు ప్రారంభించి, 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పించింది. కానీ భూగర్భగనులు నష్టాలతో నడుస్తున్న క్రమంలో వాటిని ఓసీలుగా మార్చారు. యంత్రాలను పెంచి కార్మిక భాగస్వామ్యాన్ని తగ్గించింది. దీనితో యువతకు అవకాశాలు లేవని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓసీల్లో సైతం ప్రయివేటీకరణ చేస్తుండటంతో సంస్థకు కొత్తగనులు వస్తాయా అని ఆందోళన చెందుతున్నారు. సింగరేణి కొత్త బొగ్గు గనులను ప్రారంభించి సంస్థను విస్తరించాలనే ఆలోచనలో ఉండగా కేంద్రప్రభుత్వం ప్రయివేటీకరణకు వెళ్లడం సంస్థకు అవరోధంగా మారింది. రాష్ట్ర పరిధిలోనే నాలుగు గనులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ్రశాఖ వేలంపాటల్లో చేర్చింది. తాజా వేలంపాటలో దేశంలోనే 88 బ్లాక్‌లను గుర్తించింది. అంటే ఈ గనులను ఎవరైనా వేలంలో పాల్గొని కొనుగోలు చేయొచ్చు. ఇందులో కళ్యాణ్ఖని బ్లాక్- 6, శ్రావణ్‌పల్లి, సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3 ఉన్నాయి. ఈ నాలుగు గనులను ప్రారంభించాలనే ప్రణాళికలు వేసి సింగరేణి 750 కోట్లు ఖర్చు చేసింది. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కళ్యాణ్ఖని బ్లాక్ 6 సంబంధించి భూ సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ కొంత పరిహార చెల్లింపులు జరిగాయి. శ్రావణ్‌పల్లి బ్లాక్ కోసం పర్యావరణ మెప్పు కోసం అనుమతి కోసం ఎదురు చూస్తున్న ఖమ్మం, కొత్తగూడెం పరిధిలోని మిగతా రెండు బ్లాకులని ప్రారంభించాలని ప్రణాళికలు చేసింది. ఈ తరుణంలో గనులను వేలంలో చేర్చడంతో కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గనులను దక్కించుకోవాలంటే ప్రయివేటీకరణతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలున్న సింగరేణి సైతం వేలంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేలంలో ప్రయివేటు పోటీదారులను తట్టుకొని సంస్థ బ్లాకులు దక్కించుకోవాలంటే.. ఇందుకు భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కార్మికుల సంక్షేమం, జీతభత్యాల చెల్లింపు, రక్షణ విలువలు పాటిస్తూ ఉత్పత్తి సాధిస్తున్న సంస్థకు ప్రయివేటీకరణ చేయడం సవాల్‌గా మారింది.