Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మానియాలో డాక్టర్‌పై ఫ్యాన్ ఊడిపడిన ఘటనపై ఆందోళన
- తమ ప్రాణానికి రక్షణ కల్పించాలని డిమాండ్
నవతెలంగాణ-ధూల్ పేట్
ఉస్మానియా ఆస్పత్రిలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఏ ఫ్యాన్ ఎప్పుడు ఊడిపడి తమకు ఏం జరుగుతుందోనని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం డెర్మటాలజీ విభాగంలో జూనియర్ డాక్టర్‌పై ఫ్యాన్ ఊడిపడి గాయపడిన ఘటనను నిరసిస్తూ.. మంగళవారం జూనియర్ డాక్టర్లు హెల్మెట్లు పెట్టుకుని ఆస్పత్రిలో విధులు నిర్వహించారు. అంతకుముందు నల్లరిబ్బన్లు కట్టుకుని ఆస్పత్రి భవనం నుంచి సూపరింటెండెంట్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం డాక్టర్లు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో డ్యూటీ చేయాలంటే భయంగా ఉందని, పైనుంచి ఎప్పుడు పెచ్చులూడుతాయో, ఫ్యాన్లు ఊడిపడతాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సూపరింటెండెంట్ నాగేంద్ర స్పందిస్తూ ఆస్పత్రిలో నిర్వహణపై జాగ్రత్తలు తీసుకుంటామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫ్యాన్ ఊడిపడి గాయపడిన జూనియర్ డాక్టర్ భువనశ్రీ ఆరోగ్యంగా ఉన్నారని, ఎటువంటి ఇబ్బందీ లేదని తెలిపారు.