Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పోడు భూములపై దరఖాస్తులు స్వీకరించే ముందు సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, ఇతర సభ్యులతో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేసేలా చూడాలని ఉన్నతాధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం హైదరాబాద్‌లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, విధి విధానాల రూపకల్పనపై చర్చించేందుకు ఆయన అటవీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఆయా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ, అందులో పొందు పరిచే అంశాలు ఇతర అంశాలపై చైతన్య, అవగాహనా కార్యక్రమాలను ఆయా కమిటీలు నిర్వహించాలని సూచించారు. ముందు ముందు అటవీ భూముల ఆక్రమణ ఉండదని గ్రామస్తులను చైతన్య పర్చాలని స్పష్టం చేశారు. డివిజన్, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. పోడు భూముల సమస్య అధికంగా ఉన్న జిల్లాలలో ప్రత్యేకాధికారులను నియమించాలని సోమేశ్ కుమార్ సూచించారు.
నవంబర్ నుంచే తునికాకు సేకరణ : పీసీసీఎఫ్
రానున్న తునికాకు సేకరణ సీజన్‌ను ముందస్తుగా నవంబర్ నెల నుంచే ప్రారంభించనున్నట్టు అటవీ సంరక్షణ రాష్ట్ర ప్రధాన అధికారి ఆర్.శోభ ప్రకటించారు. అడవిని కాపాడటం, అగ్ని ప్రమాదాల నివారణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తునికాకు సేకరణ ఏర్పాట్లపై బీడీ లీఫ్ అసోసియేషన్ సభ్యులతో అటవీ శాఖ ఉన్నతాధికారులు బుధవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తునికాకు సేకరణకు ఈసారి 242 యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గతేడాది మాదిరిగానే అన్లైన్లో వేలం ద్వారా యూనిట్లను కేటాయిస్తామని చెప్పారు. వేసవి ప్రారంభంలో అగ్ని ప్రమాదాలను నివారించటంలో భాగంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో తునికాకు సేకరణ చేసే కాంట్రాక్టర్లు ఫైర్ వాచర్లను నియమించాలని ఆదేశించారు.