Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మొబైల్ఫోన్లను భద్రంగా ఉంచుకుంటేనే ఆర్థికంగా భద్రత చేకూరుతుందని కమ్యూనికేషన్లు, టెలికం శాఖ డిప్యూటీ డైరెక్టర్ జీవీ రాజారెడ్డి అన్నారు. అమాయకుల నుంచి మొబైల్ ఫోన్ల ద్వారా మోసాలకు పాల్పడే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వ విజిలెన్స్ అవగాహనా వారోత్సవాల్లో భాగంగా బుధవారంనాడాయన మొబైల్ భద్రతా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిత్యవసరాల్లో మొబైల్ ఒకటిగా మారిందనీ, దీన్నే ఆర్థిక నేరగాళ్లు మోసాలకు వినియోగిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఓటీపీలు, బ్యాంకు వివరాలు వంటివి ఫోన్ ద్వారా ఎవరికీ షేర్ చేయవద్దని చెప్పారు. ఏదైనా ఫోన్లు వస్తే కచ్చితంగా సమీపంలోని బ్యాంకులకు వెళ్లి నిర్థారణ చేసుకోవాలని సూచించారు. నకిలీ ఫోన్ కాల్స్, సెక్స్ రాకెట్స్, మొబైల్ టవర్ల ఏర్పాటు మోసాలు, బహుమతులు, రుణాలు, క్యూఆర్ కోడ్స్, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ తరహా మోసాలకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఐటీఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జీవీ రమణారావు తదితరులు పాల్గొన్నారు.