Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట కలెక్టర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి:
తెలంగాణ రైతు సంఘం డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి విత్తనాలు అమ్మొద్దంటూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రంలో వరి పంటకు ప్రణాళిక రూపొందించాలని కోరింది. ఈమేరకు బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జంగారెడ్డి, టి సాగర్ ఒక ప్రకటనలో విడుదల చేశారు. వరి వేయొద్దంటూ ప్రభుత్వ విధానం ప్రకటించలేదనీ, అందుకోసం జీవోలు జారీ చేయలేదనీ, కలెక్టర్‌గా ఉన్న ఆధికారి తానే ప్రభుత్వ విధానాన్ని ప్రకటించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి జి జగదీష్‌రెడ్డి ప్రభుత్వం యాసంగి వడ్లు కొనదని ప్రకటించారనీ, వరి పంటపై ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదంటూ మరో మంత్రి ప్రకటించి పరస్పర విరుద్ద ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. దీంతో రైతుల్లో గందరగోళం నెలకొందని తెలిపారు. నీరు బాగా ఉన్నప్పుడు మెట్ట పంటలు పండవనీ, ఒక వేళ వేసినా అవి మొలకెత్తవని గుర్తు చేశారు. యాసంగిలో ఉలవలు, వేరుశనగ, నువ్వులు, ఆముధం పంటలు వేసినా, అవి దిగుబడులు రాకపోగా, పెట్టిన ఖర్చులు కూడా రావని తెలిపారు. వ్యవసాయ శాఖ మండలాలవారీగా ప్రణాళికలు రూపొందించాలనీ, అందుకు తగిన విత్తనాలను అందుబాటులో ఉంచాలనీ, ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 802 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ, అయినా ప్రభుత్వానికి జ్ఞానోదయం కలగడం లేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం అధికారికంగా విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులో ఉంచి, రైతులకు వరిపై అవగాహన కల్పించాలని కోరారు.