Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంద్రా పోర్టు నుంచి విజయవాడకు డ్రగ్స్ రాక
- అమిత్‌షా కనుసన్నల్లో వైసీపీ ప్రభుత్వం
- పెగాసస్‌పై సుప్రీం తీర్పు కేంద్రానికి చెంపపెట్టు: సీపీఐ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గుజరాత్‌లోని ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని కాపాడేందుకే షారుఖ్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను ఎన్సీబీ అరెస్టు చేసిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ షారుఖ్ కుటుంబం బీజేపీ వ్యతిరేకమనీ, అందుకే ఆర్యన్‌ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా గుజరాత్ ముంద్రా పోర్టుకు డ్రగ్స్ సరఫరా అయ్యిందన్నారు. ముంద్రాపోర్టు ప్రధాని మోడీ దత్తపుత్రుడు ఆదానీదని అన్నారు. అదానీకి రోజుకు రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందనీ, సక్రమంగా సంపాదిస్తే అంత ఆదాయమెలా వస్తుందని ప్రశ్నించారు. హెరాయిన్, స్మగ్లింగ్ ద్వారానే రోజుకు రూ.వెయ్యి కోట్లు వస్తాయని చెప్పారు. డ్రగ్స్ ప్రధాన కార్యాలయం విజయవాడలో ఉందన్నారు. అందుకే ముంద్రా పోర్టు నుంచి విజయవాడకు డ్రగ్స్ వచ్చాయని వివరించారు. అమిత్‌షా కనుసన్నల్లో వైసీపీ ప్రభుత్వం నడస్తున్నదన్నారు. విజయవాడ నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు హెరాయిన్ సరఫరా అవుతుందని చెప్పారు. హెరాయిన్ దొరికిన తర్వాత అదానీ ప్రపంచమంతా ముద్దాయిగా మారుమోగుతున్న సమయంలో దృష్టి మళ్లించేందుకు ఆర్యన్‌ఖాన్‌ను పట్టుకున్నారని అన్నారు. పెగాసెస్‌పై సుప్రీం కోర్టు ప్రత్యేకంగా జస్టిస్ రవీంద్రన్ నాయకత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయడం ప్రజాస్వామికవాదుల విజయమని చెప్పారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అని విమర్శించారు. ప్రశ్నించే వారిపై పెగాసెస్ నిఘా సంస్థను కేంద్రం ప్రయోగించిందని అన్నారు. ఏపీలో రాక్షస పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుల ఇండ్లపైనా, పార్టీ కార్యాలయాలపైనా దాడులు జరపడాన్ని ఆయన ఖండించారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జగన్, కేసీఆర్ ఎందుకు పోరాడ్డం లేదని ప్రశ్నించారు. అందమైన కాళేశ్వరానికి అందమైన అవినీతి ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు తప్ప సెంటుభూమికి రావడం లేదని చెప్పారు.
హుజూరాబాద్ ఎన్నికలకు దూరం : చాడ
రాజకీయాలు కలుషితమయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు, రౌడీలు, గూండాలు, దోపిడీదారులు, మాఫియాలు రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. ప్రజా సేవకులు సన్నగిల్లిపోతున్నారనీ, ప్రజా భక్షకులు పెరిగిపోతున్నారని అన్నారు. డబ్బు, మద్యం, గంజాయి విచ్చలవిడిగా పంచుతున్నారని విమర్శించారు. అందుకే హుజూరాబాద్ ఎన్నికలకు దూరంగా ఉండాలని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. నూతన సాగు చట్టాలపై స్టే ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. సాగు చట్టాలు రద్దయ్యేదాకా పోరాడతామన్నారు.