Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్‌కు ఉత్తమ్, మహేశ్వర్‌రెడ్డి ప్రశ్న
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటిస్తే...వరి ఎందుకొద్దంటున్నారని ఎంపీ ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఏ ప్రభుత్వమైనా మద్దతు ధర ప్రకారం వరి ధాన్యం కొనవాల్సిందేనని చెప్పారు. తెలంగాణలో 70శాతం మంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారనీ, అందులో వరి సాగు ఎక్కువగా చేస్తారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో వరి వద్దంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రైతులను బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎస్సీ విభాగం చైర్మెన్ ప్రీతం, జగదీశ్వర్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వరి ఎక్కువగా చేస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని రైస్‌బౌల్ చేస్తామంటూ చెప్పిన కేసీఆర్ ఇప్పుడు వరి కొనమనడం సిగ్గుచేటన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి వరి విత్తనాలు అమ్మొద్దంటూ ఆదేశించడం సరైందికాదన్నారు. పంటల మార్పిడి చేయాలనుకుంటే అటువైపు రైతులను మళ్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. పిచ్చి తుగ్లక్ మాదిరిగా రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు.కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి మాట్లాడుతూ నీటివసతి అందుబాటులో వున్న ప్రాంతాల్లో ఎక్కువగా వరి సాగవుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో ధాన్యం కొనబోమని చెప్పడం దారుణమన్నారు. సాగు విషయంలో రైతులను బలవంతపెట్టకూడదని అధికారులను కోరారు.