Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు
- తెరవని మిల్లుల గేట్లు
నవతెలంగాణ- వేములపల్లి
వరి ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. మిల్లుల వద్ద ధాన్యంతో ట్రాక్టర్లు బారులు తీరాయి. కానీ, మిల్లుల గేట్లు తెరుచుకోలేదు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలోని మహర్షి, సాయిరమణ రైస్‌మిల్లుల ఎదుట అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై బుధవారం జరిగింది. రోడ్డుపై అడ్డంగా ధాన్యం ట్రాక్టర్లను పెట్టి రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. తాము ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే దారిలేక రోడ్డెక్కామన్నారు. ఖరీఫ్ సీజన్లో కోతలు ప్రారంభం కావడంతో ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు. మండల పరిధిలోని అన్ని మిల్లుల యాజమాన్యాలు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రెండ్రోజులుగా ధాన్యం ట్రాక్టర్లతో పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత పేరుతో కొనడానికి నిరాకరిస్తున్నారని.. ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెగులు సోకి పంట నష్టపోయామని వాపోయారు. మద్దతు ధర రూ.1920 ఉండగా మిల్లర్లంతా సిండికేట్‌గా మారి క్వింటాకు రూ.1700 నుంచి రూ.1800కే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రైతుల ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు సుధీర్‌కుమార్, రాజు అక్కడికి చేరుకుని ధాన్యం కొనుగోలు అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.