Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బూడిదైన గోదాం
- వంద కోట్ల్ల ఆస్తి నష్టం
నవతెలంగాణ-ఉట్నూర్
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు సమీపంలో గల ఐఎంపీఎల్(లిక్కర్ డిపో)లో బుధవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు వంద కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. స్థానికులు, గోదాం మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం గోదాముల్లోంచి పొగలు గమనించి స్థానికులు వెంటనే డిపో మేనేజర్‌తో పాటు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పేలోపే గోదాం మొత్తం కాలి బూడిదైంది. కోట్ల రూపాయల విలువ గల లిక్కర్ కార్టూన్లు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. గోదాములో నిల్వ ఉన్న స్టాక్ ఎంత? ఎంత కాలిపోయింది? ఎంత ఆస్తి నష్టం వాటిల్లింది అనే అంచనాల్లో అధికారులు ఉన్నారు. ఈ లిక్కర్ డిపో నుంచి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు మద్యం సరఫరా అవుతుంది. రోజుకు రెండు కోట్ల వరకు టర్నోవర్ జరిగే ఈ డిపో అగ్నికి ఆహుతి కావడంతో కోట్లల్లో నష్టం జరిగింది. ఖచ్చితంగా ఎన్ని కోట్లు అనేది తెలియాల్సి ఉంది. డిపో మేనేజర్ ప్రభుదాస్ మాత్రం సుమారు వంద కోట్లు నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఏఎస్పీ హర్షవర్ధన్, సీఐ సైదారావు, ఎస్ఐ సుబ్బారావు, ఆర్డీఓ రాజేశ్వర్, రెవెన్యూ, ఎక్సైజ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు భారీగా చెలరేగడంతో ఒక్క అగ్నిమాపక వాహనంతో అదుపు చేయడం కష్టం కావడంతో మరో మూడు అగ్నిమాపక వాహనాలను తెప్పించారు. గంటలపాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపు చేశారు. గోదామును ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్, జడ్పీటీసీ చారులత రాథోడ్ పరిశీలించారు.