Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనార్టీ బంధుపై ఎంఐఎం ఎందుకు నోరుమెదపడం లేదు
- 12 శాతం రిజర్వేషన్లు అమలు కావట్లే...: మైనార్టీ ఆటో డ్రైవర్ల ధర్నాలో డీజీ నర్సింహారావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మైౖనార్టీ డ్రైవర్లకు తక్షణమే రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లను ఫైనాన్షియర్ల దాడుల నుంచి ప్రభుత్వం రక్షణ కల్పించాలన్నారు. మైనార్టీలకు తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆవాజ్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఏడేండ్లు గడిచినా.. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. గతంలో సుధీర్ కమిషన్, జస్టిస్ సచార్ కమిటీ రిపోర్టుల్లో ముస్లింలు ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారనీ, వీరికి తక్షణమే ప్రభుత్వాలు బడ్జెట్లో పది శాతం కేటాయించి ఆదుకోవాలంటూ సిఫార్సు చేసినా ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరోనా కాలంలో మైనార్టీ డ్రైవర్ల ఇండ్లపై ఫైనాన్షియర్లు వచ్చి దాడులు చేస్తున్నారన్నారు. ఆర్థిక సమస్యలతో పాటు ఫైనాన్స్ సమస్యలు, ఆటో యాజమాన్యాల ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి మైనార్టీ డ్రైవర్లకు సహాయం చేసి ఆదుకోవాలనీ, లేనిపక్షంలో మైనార్టీ డ్రైవర్లు ఎక్కడిక్కడ తమ తమ ప్రాంతాల్లో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ.. కరోనా కాలంలో మైనార్టీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలావుందో పట్టించుకునే వారు కరువయ్యారని అన్నారు. కిరాయిలు, స్కూల్ ఫీజులు, రంజాన్, బక్రీద్ పండుగలకు కొత్త బట్టలు కొనుక్కునే పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అన్సారీ మాట్లాడుతూ.. హైదరాబాద్లో సుమారు 50 వేల మంది మైనార్టీ డ్రైవర్లు ఆటోలు, ట్రాలీలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. పదిహేను రోజుల నుంచి మైనార్టీ డ్రైవర్ల సమస్యలపై ఆవాజ్ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించగా.. అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయనీ, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి స్పందనా లేదని వాపోయారు. కోవిడ్ కారణంగా మైనార్టీ ఆటో డ్రైవర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారన్నారు. అప్పులతో, అర్ధాకలితో బతుకీడుస్తూ వారి కుటుంబాలు వీధిన పడ్డాయని వివరించారు. ధర్నాలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతీఖుర్ రహమాన్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సిరాజ్ ఖాన్, ఆల్ ఇండియా సూఫీ ఉలేమా కౌన్సిల్ అధ్యక్షులు మౌలానా ఖైరుద్దీన్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల కార్యదర్శులు అబ్దుల్ సత్తార్, మహమ్మద్ అలీ, ఉపాధ్యక్షులు అజీజ్ అహమ్మద్ ఖాన్, షేక్ యాకూబ్, బాబర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.