Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు రాష్ట్రాల్లో వారి కదలికలపై ఆరా
- ఇద్దరు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు సమాచారం?
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టుల కోసం వేట సాగిస్తున్న నిఘా వర్గాలకు ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలకు సంబంధించిన సమాచారం లభించినట్టు తెలిసింది. వీరిద్దరు కూడా దండకారణ్యంలో ఒక రహస్య ప్రదేశంలోనే చికిత్సను పొందుతున్నారని కూడా నిఘా వర్గాలకు తెలిసింది. గత ఏడాది కాలంలో దండకారణ్యంతో పాటు వివిధ అటవీ ప్రాంతాలలో ఉన్న పలువురు మావోయిస్టు అగ్రనేతలకు కరోనా సోకినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ తో పాటు మరో ముగ్గురు నాయకులు కరోనా కారణంగా మృతి చెందినట్టు ఆ పార్టీ నాయకత్వమే ప్రకటించింది. మరో వైపు ఇటీవలే మావోయిస్టు పార్టీ అగ్రనేత, సిద్ధాంత నిపుణుడు, కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే ఎలియాస్ రామకృష్ణ ఎలియాస్ అక్కిరాజు హరగోపాల్ సైతం మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతూ మరణించడం తెలిసిందే. అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల బలగాలు వెలుపలి నుంచి వైద్య సేవలు అందకుండా చేయడం ద్వారా ఆర్కే మృతికి కారకులయ్యారని ఆయన భార్య శిరీష ఆరోపించారు. ఇదే విధానాన్ని మిగతా మావోయిస్టు నాయకులు మరణించడానికి ప్రయోగించారని మావోయిస్టు వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు సైతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలకు సమాచారం ఉన్నట్టు తెలిసింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నిఘా వర్గాలు అప్రమత్తమై వారి గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులు కూడా దండకారణ్యంలోని రహస్య ప్రదేశంలో చికిత్సను పొందుతున్నారని నిఘావర్గాలకు సమాచారం ఉన్నట్టు తెలిసింది. ఇటీవలనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన మడ్వి ఎడిమ ఏటూరు నాగారంలోకి వచ్చి రహస్య ప్రదేశంలో మకాం వేసి చికిత్సను పొంది వెళ్లారని అనుమానాలు వ్యక్తం కాగా అలాంటిదేమీ లేదని ఏటూరు నాగారం ఏఎస్పీ ఖండించారు. అయితే తాజాగా ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు సీరియస్గా ఉన్నారనే సమాచారంతో మూడు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు. దండకారణ్యంలోకి వెళ్లే మార్గాలపై నిఘా వర్గాలు డేగకన్నువేసినట్టు తెలిసింది.