Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరిపై మంత్రులు, అధికారుల విభిన్న ప్రకటనలు
నవతెలంగాణ- విలేకరులు
వరి పంటపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో యాసంగిలో వరి సాగుపై మంత్రులు, అధికారులు తలోరకంగా స్పందిస్తున్నారు. వరి విత్తనాలు అమ్మితే షాపులు మూసివేస్తామని, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చినా లెక్కచేయనని సోమవారం విత్తన డీలర్లు, అధికారులతో అంతర్గతంగా జరిగిన సమీక్షా సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై బుధవారం మంత్రులు, కొంతమంది అధికారులు మాట్లాడారు. రైతులంతా బ్రహ్మాండంగా వడ్లు వేసుకోవచ్చని హుజురాబాద్ ఎన్నికల సభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. 'మొన్నటి దాకా వడ్లు కొనరని అసత్య ప్రచారం చేసి, ఇప్పుడు అన్ని ఊళ్లలో కాంటాలు అయితాంటె, మళ్లీ యాసంగిలో వరి వేయొద్దని కొత్త ప్రచారం చేస్తున్నరు అని బీజేపీనుద్దేశించి హరీశ్‌రావు అన్నారు. 'ఇయ్యాల కరీంనగర్ జిల్లాకలెక్టర్ ప్రకటన చేసిండు.. యాసంగిలో వరి వేసుకోవచ్చని.. ఇక్క డ విత్తన వరి పెద్ద మొత్తంలో పండుతాంది.. మీరు తప్పని సరిగా వరి పంటను పండించుకోవచ్చు'.. అని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రైతులు యాసంగిలో వరి పంట వేయొద్దని, వేస్తే ఒక్క గింజ కూడా కొనుగోలు చేయబోమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు, వానకాలం వడ్ల కొనుగోళ్లపై అగ్రికల్చర్, కో ఆపరేటివ్, మిల్లర్లతో నల్లగొండ కలెక్టరేట్లో మంత్రి సమీక్ష చేశారు. రైతులకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతోనే రాష్ట్ర సర్కార్ ప్రస్తుతం వడ్లు కొంటోందని చెప్పారు. యాసంగిలో వడ్ల కొనుగోలుపై కేంద్రం లిమిట్ పెట్టినందున రైతులు ఇతర పంటలు వేసేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. యాసంగిలో వరికి బదులు ఆయిల్‌పామ్, మినుములు, శనగ, వేరుశనగ, ఆముదం, నువ్వులు, పెసర వంటి పంటలు సాగుచేసేలా ఒప్పించాలన్నారు. భూమి రకాన్ని బట్టి పంటలు పండించేలా చూడాలన్నారు. వానాకాలం పంట కొనుగోలుపై రైతులకు టోకెన్లు జారీ చేసి క్రమబద్ధీకరణ చేయాలని సూచించారు. రైతులు హైబ్రిడ్ లేదా సూటి రకాల వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని కరీంనగర్ కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. జిల్లాలోని రైస్ మిల్లర్లు సన్నరకం ధాన్యం కొనుగోలుకు అంగీకరించినందున.. రైతులు సన్నాలు వేసుకోవచ్చన్నారు. ప్రయివేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్పారు. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలన్నారు.