Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు తెలంగాణ జూడా విజ్ఞప్తి
- ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం నిర్మించాలి
- మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలి : తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాదు
రోగులకు ఇబ్బంది కలిగినప్పుడు, దురదృష్టవశాత్తు వారు చనిపోయినప్పుడు పేషెంట్ల బంధువులు తమపై దాడులు చేయటం ఆనవాయితీగా మారిందని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం (టీ-జూడా) ఆవేదన వ్యక్తం చేసింది. మౌలిక వసతులు లేకుండా సరైన పరికరాలు, మందులు అందుబాటులో లేకుండా తామెలా వైద్యం చేయగలమని ఆ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల తమపై దాడులు చేయటాన్ని మానుకొని ఆయా సౌకర్యాల కోసం వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనాన్ని వెంటనే నిర్మించాలని ఆ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆ సంఘం ఆధ్వర్యంలో కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళా శాల ఆవరణలో బుధవారం మీడియా సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంఘం సలహాదారు డాక్టర్ రాజీవ్, ఉస్మానియా మెడికల్ కళాశాల జూడా అధ్యక్షుడు డాక్టర్ సాగర్. ప్రధాన కార్యదర్శి డాక్టర్ కార్తీక్. సలహాదారు డాక్టర్ విజరు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ఒక పీజీ వైద్యురాలిపై ఆస్పత్రి భవనం పెచ్చులూడి పడటంతో ఆమె గాయపడిం దని గుర్తుచేశారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు లేక రోగులుతీవ్ర ఇబ్బం దులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన మందులు, వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ వైద్యులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయా ల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ గతంలో ఆస్పత్రి సందర్శించినప్పుడు వెంటనే నూతన భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఆ హామీని ఇప్పటివరకు నెరవేర్చ లేదని తెలి పారు. జూనియర్ వైద్యులకు స్టయిఫండ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాంధీ, ఉస్మానియాలో గుండెకు సంబంధించిన పరిక రాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే మిష న్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉస్మానియాలో 24 గంటలు ల్యాబ్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
చెస్ట్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ లేదు...
డాక్టర్ రాజీవ్ మాట్లాడుతూ చర్మవ్యాధుల విభాగంలో విధులు నిర్వహిస్తున్న పీజీ డాక్టర్‌పై ఫ్యాన్ ఊడి పడినప్పటికీ అదష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. జనరల్ ఆసుపత్రి బిల్డింగ్ శిథిలావస్థలో ఉందనీ, వర్షం పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ అయితే పరిస్థితేంటని? ప్రశ్నించారు.
వేల మంది రోగులు, వైద్యసిబ్బంది ఉండే చోట ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చెస్ట్ ఆస్పత్రిలో సీటీ స్కాన్ లేదని తెలిపారు. రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరణించిన ఫ్రంట్‌లైన్ వర్కర్లను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
సమ్మె నోటీస్ ఇస్తే తప్ప
స్టయిఫండ్ ఇవ్వరు..
డాక్టర్ సాగర్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లకు ఉపకారవేతనం రావటం లేదని తెలిపారు.
సమ్మె నోటీస్ ఇస్తే తప్ప స్టయిఫండ్ ఇవ్వటం లేదనీ, దీనితో మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల సంఖ్య పెరుగుతున్నా... హాస్టళ్లు పెరగటం లేదనీ, జిల్లా ఆస్పత్రులను మెడికల్ కాలేజీలుగా మారుస్తుండటంతో, ఉన్న మెడికల్ పరికరాలతోనే వైద్యం చేయాల్సి వస్తుందని తెలిపారు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది లేక ముగ్గురు చేయాల్సిన పని భారం ఒక్కరిపైనే పడుతుందన్నారు.
గాంధీలో ఎంఆర్ఐ లేదు..
డాక్టర్ నవీన్ మాట్లాడుతూ గాంధీ ఆస్పత్రిలో రెండేండ్ల నుంచి ఎంఆర్ఐ లేదనీ, కార్డియాలజీ విభాగంలో గుండెకు స్టంట్ వేయాలన్నా కనీస వసతులు లేవని తెలిపారు.
ప్రాణాలను నిలబెట్టే మందులూ అందుబాటులో లేవని చెప్పారు. ఆస్పత్రికి వచ్చే రోగులను టెస్టుల కోసం బయటికి పంపిస్తున్నామని చెప్పారు. పని చేసే వైద్యులతో పాటు ప్రజలు, మిగిలిన అన్ని వర్గాల వారు ఒకే వేదికపైకి వచ్చి ఆస్పత్రుల్లో సదుపాయాలు, వైద్యం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు.