Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంచం ఇవ్వనందుకే కక్ష కట్టారు
- మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలో నివాసముంటున్న ఓ నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన ఇంటిని లంచం ఇవ్వలేదన్న కక్షతో అధికార పార్టీ అండతో కూల్చడం అన్యాయమని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ తెలిపారు. గురువారం ఈ ఘటనపై బాధితులతో కలిసి మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బాధితులు సపావత్ జయ భర్త జాను నాయక్ నివాసాన్ని కూల్చిన దుండగులపైనా, మున్సిపల్ అధికారులపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నందికొండ మున్సిపాలిటీ చైర్మెన్ మామ బ్రహ్మారెడ్డి రూ. 50వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయగా సదరు ఇంటి యజమాని నిరాకరించినందున్నే అతనిపై కక్షగట్టి ఇంటిని కూల్చారని తెలిపారు.
అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి యజమానికి నష్టపరిహారం కింద రూ.20లక్షలు ఇవ్వాలని కోరారు. అదే స్థలంలో డబుల్ బెడ్రూం కట్టించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై ఏదో ఒక నెపంతో దాడులు జరుగుతున్నాయనీ, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. హెచ్ఆర్సీని కలిసిన వారిలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బంజారా, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కోర్ర శంకర్ నాయక్, ఎస్టీ సెల్ నాగార్జునసాగర్ నియోజకవర్గ అధ్యక్షుల సపావట్ పాండు నాయక్ , గిరిజన సంఘం జిల్లా నాయకులు రమావత్ కృష్ణ నాయక్ , మేరవత్ ముని నాయక్ రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.