Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ)తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నదని తెలంగాణ సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ విమర్శించారు. తద్వారా అనవసర జాప్యానికి కారణమవుతున్నదని ఆయన తెలిపారు. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మెన్‌కు గురువారం లేఖ రాశారు. గోదావరి డీపీఆర్‌లపై జీఆర్ఎంబీ స్క్రూటినీ పేరుతో తన పరిధికి మించి వ్యవహరిస్తున్నదని తెలిపారు. డీపీఆర్‌లను వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)కి పంపాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం క్లాజ్ 85(8)(డీ) లో పేర్కొన్న అధికారాలకు మించి అనేక అంశాలపై రీమార్కులు రాస్తూ కాలయాపన చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్లాజ్‌లో పేర్కొన్న అంశాలకు మాత్రమే పరిమితం కావాలని ఆయన కోరారు. మిగతా అంశాలను పరిశీలించడానికి కేంద్ర జలసంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తక్షణమే తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సీడబ్ల్యూసీకి పంపాలని జీఆర్ఎంబీని కోరారు.