Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామీలు నెరవేర్చడంలో ఇద్దరూ విఫలం
- భవిష్యత్ ఎర్రజెండాలదే : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- కొణిజర్ల
దేశంలో మోడీకి, రాష్ట్రంలో కేసీఆర్‌కు రాబోయే ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఇద్దరూ విఫలమయ్యారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో కామ్రేడ్ లింగాల యెహన్ నగర్లో సీపీఐ(ఎం) మండల 8వ మహాసభ నాయకులు కొప్పుల క్రిష్ణయ్య, పూల్లూరి భూలక్ష్మీ, చింతపల్లి ప్రసాద్, బోయినపల్లి శ్రీనివాస్‌రావు అధ్యక్షతన గురువారం జరిగింది. తొలుత అమ్మపాలెం రోడ్డు నుంచి బతుకమ్మలు, లంబాడీల నృత్యంతో పాటు కోలాటాలతో నాయకులు, కార్యకర్తలు ఎర్రజెండాలు చేతబూని సభాప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ పార్టీ సీనియర్ నాయకులు చింతనిప్పు సూర్యం పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. ప్రతియేటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 4 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, కార్మిక, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని 11 నెలలుగా రైతులు పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యుడి పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. కేంద్ర మంత్రి కొడుకు కారుతో రైతులను తొక్కించిన ఘటనలో ఆరుగురు రైతులు మరణించినా.. ఇంతవరకూ ఆ మంత్రి, అతని కుమారుడిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలన్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నాడని తెలిపారు. దళితబంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నిక అయిపోగానే ఉండదన్నారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయడంతో పాటు ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆగ్రకులాల్లోని పేదలకు కూడా రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పోడుభూములకు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం సరియైంది కాదనీ, గతంలో ఇచ్చిన దరఖాస్తులను పరిశీలించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరిసాగు చేయవద్దని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రకటించడం సరైందికాదనీ, ఏ భూమిలో ఏ పంట వేయాలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయిస్తారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించి పోరాడుతూ ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టు పార్టీలేనని అన్నారు. మహాసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, యర్రా శ్రీకాంత్, బండి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, మెరుగు సత్యనారాయణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్, పారుపల్లి ఝాన్సీ, బాణోత్ బాలాజీ, బండారు రమేష్, మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.