Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 లక్షలకు పైగా లావాదేవీలు
- సీఎం కేసీఆర్ హర్షం
- అధికారులకు అభినందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ధరణి పోర్టల్ ప్రారంభమై ఏడాదైంది. 2020 అక్టోబర్ 29న దీన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ధరణి సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న సంబంధిత అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, తహశీల్దార్లకు అభినందనలు తెలిపారు. ధరణి అందిస్తున్న పారదర్శకమైన, అవాంతరాలు లేని సేవలతో పౌరులు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో ధరణి పౌరుల సేవలో మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ధరణి ప్రత్యేకతలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.
ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్ సేవలను అందించే ఆన్లైన్ పోర్టల్ అని పేర్కొంది. భూమి సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తున్నది. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో 574 తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సంఖ్యలు తమకు తాముగా మాట్లాడతాయి. ఈ ఏడాదిలో ధరణి వెబ్‌పోర్టల్ 5.17 కోట్ల హిట్లను సాధించగా, దాదాపు 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి. అంతకు ముందు పట్టాదార్ పాసుపుస్తకాలు ఇవ్వని దాదాపు 1,80,000 ఎకరాల భూమిని ఈ ఏడాది కాలంలో ధరణి పరిధిలోకి తీసుకొచ్చారని ఆ ప్రకటనలో తెలిపింది. నిత్యం పెరుగుతున్నమార్పులు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చుకునే సామర్థ్యం ధరణి ప్రత్యేకత అని తెలిపింది. ఎప్పటికప్పుడు, స్టేక్ హౌల్డర్ల నుంచి సలహాలు, సూచన లకనుగుణంగా సరికొత్త లావాదేవీల మాడ్యూల్స్ ను జోడించారు. వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించడానికి కూడా ప్రత్యేక మాడ్యూల్స్ పొందుపరచారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మాడ్యూల్స్, 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ ఉన్నాయని ప్రభుత్వం వివరించింది.
ధరణి పురోగతి వివరాలు
హిట్ల సంఖ్య : 5.17 కోట్లు
బుక్ చేసిన స్లాట్లు : 10,45,878
పూర్తయిన లావాదేవీలు : 10,00,973
విక్రయాలు : 5,02,281
గిఫ్ట్ డీడ్ : 1,58,215
వారసత్వం : 72,085
తనఖా : 58,285
పరిష్కరించబడిన ఫిర్యాదులు : 5.17 లక్షలు
పెండింగ్ మ్యుటేషన్లు. : 2,07,229
భూమి సంబంధిత విషయాలపై ఫిర్యాదులు : 1,73,718
నిషేధించబడిన జాబితా : 51,794
కోర్టు కేసులు, సమాచారం : 24,618