Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈసీ నిర్ణయంపై హైకోర్ట్ వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నిక ముగిసే వరకూ 'దళితబంధు' అమలును నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తీసుకున్న నిర్ణయంలో జోక్యానికి హైకోర్టు అంగీకరించలేదు. ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న దశలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని చెప్పింది. 'దళితబంధు'ను కొనసాగించాలనే రెండు ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది. ఉప ఎన్నికలు జరుగుతున్న కారణంగా హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా 'దళితబంధు'ను అమలు చేయరాదని ఈసీ ఈనెల 18న జారీచేసిన ఆదేశాలను సవాలు చేస్తూ సీనియర్ విలేకరి మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ నేత ఎం జడ్సన్‌లు వేసిన పిల్స్‌ను కొట్టేసింది. ఉప ఎన్నికలు అయ్యే వరకు దళితబంధును ఆపాలంటూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ స్వచ్ఛంద సంస్థ వేసిన రిట్లో ఉత్తర్వులు అవసరం లేదని తేల్చింది. ఈ మేరకు ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. నిష్ఫక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే అధికారం, బాధ్యత ఈసీకి ఉందని చెప్పింది. రాజ్యాంగంలోని 324 అధికరణం కింద ఈసీకి ఉన్న అధికారాలను గుర్తు చేసింది. బాలాజీ-తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఈసీ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని చెప్పింది. దళితబంధు పథకంపై తామేమీ వ్యాఖ్య చేయడం లేదని తెలిపింది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్రం ప్రభుత్వం అదే తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఎన్నికల కోడ్ అమలు అయ్యాకే పైలెట్ ప్రాజెక్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. అందుకే ఈసీ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ స్కీం ద్వారా నేరుగా దళిత కుటుంబాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఆపాలన్న ఈసీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడం లేదు.. అని తీర్పు చెప్పింది
దిశ కమిషన్ తీరుపై రిట్లు డిస్మిస్
దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుపుతున్న త్రిసభ్య కమిషన్ సాక్షులను ఎప్పుడు విచారించాలనేది కమిషన్ నిర్ణయిస్తుందనీ, తాము ఏవిధమైన ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. కమిషన్ విచారణను సవాల్ చేసిన రిట్లపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏ సాక్షిని ఎప్పుడు విచారించాలన్నది కమిషన్ నిర్ణయమని స్పష్టం చేసింది. కమిషన్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని, సాక్షులందరి విచారణ పూర్తి తర్వాతే తమను స్వతంత్ర సాక్షులుగా విచారించాలని దర్యాప్తు అధికారులు డీఎస్పీ వాసం సురేందర్, ఇన్స్పెక్టర్ కొండ నర్సింహరెడ్డిలకు కమిషన్‌ను కోరే అధికారం లేదని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు వీరిద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తమను కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టంలోని సెక్షన్ 8-బి ప్రకారం సాక్ష్యులందరి విచారణ పూర్తయిన తర్వాత స్వతంత్ర సాక్షులుగా విచారించాలని కోరిన వీరిద్దరి వినతిని త్రిసభ్య కమిషన్ మౌఖికంగా తోసిపుచ్చింది. దీంతో కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ దాఖలు చేసిన రిట్లను హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది.
క్విడ్‌ప్రోకో నిజం కాదు..
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆక్రమాస్తులపై సీబీఐ తమపై అన్యాయంగా కేసులు పెట్టిందని, క్విడ్‌ప్రోకో ఆరోపణల్లో వాస్తవం లేదని హెటిరో, అరబిందో కంపెనీలు హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ ఎదుట వాదనలు వినిపించాయి. తమ కంపెనీలకు జడ్చర్ల సెజ్‌లో ఎకరం రూ.7 లక్షలకు చొప్పున తమకు75 ఎకరాలను ఇస్తే.. జగన్‌కు చెందిన భారతి సిమెంట్‌లో పెట్టుబడుల కారణంగా తమ కంపెనీలకు రూ.8.5 కోట్ల మేరకు లబ్ధి చేకూరిందని సీబీఐ వాదనల్లో వాస్తవం లేదన్నాయి. తమ కంపెనీలు రూ.19.5 కోట్లు పెట్టుబడులు పెట్టాయని, క్విడ్‌ప్రోకో అయితే పెట్టుబడి కంటే ఎక్కువ ప్రయోజనంకూరాలి కదా అని ప్రశ్నించాయి. సీబీఐ పెట్టిన కేసుల్ని కొట్టేయాలని కోరాయి. విచారణ నవంబర్ 1కి వాయిదా పడింది. ఇదిలా ఉండగా, ఈ కేసులో తొమ్మిదో నిందితుడుగా ఉన్న మాజీ ఐఏఎస్ ఆఫీసర్ బీపీ ఆచార్య తన పిటిషన్‌ను వాపస్ తీసుకుంటామని చెప్పడంతో హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఆయన వేసిన వేరే కేసులో హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.