Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదాల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షల పరిహారమివ్వాలి
- సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బొగ్గు గనుల ప్రమాదాల్లో, కరోనాతో చనిపోయిన కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలనీ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యర్రగాని కృష్ణయ్య, బి.మధు ప్రకటించారు. ఈ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మైన్ ప్రమాదాల్లో చనిపోయిన పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోలిండియా రెండేండ్ల కింద సర్క్యూలర్ జారీచేసినా సింగరేణి పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇటీవల సింగరేణిలో 11 మంది కాంట్రాక్ట్ కార్మికులు మైన్ ప్రమాదంలో, మరో 11 మంది కరోనాతో చనిపోయారని తెలిపారు. రామగుండం1 ఏరియాలో ఎక్స్ప్లోరేషన్లో, రామగుండం-3 ఏరియా పరిధిలోని ఓసీపీ-1లో జరిగిన ప్రమాదాల్లో నలుగురు కాంట్రాక్టు కార్మికులు చనిపోయారనీ, కోలిండియా సర్క్యూలర్ ప్రకారం కాంట్రాక్ట్ సిబ్బంది కుటుంబాలకు రూ.15 లక్షల ప్రత్యేక ఎక్స్ గ్రేషియో చెల్లిస్తామంటూ యాజమాన్యం హామీనిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ, నేటి వరకు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించలేదని వాపోయారు. ఇటీవల మణుగూరు ఓసి 2 ప్రమాదంలో ఇద్దరు పర్మినెంట్ కార్మికులు, ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోగా పర్మినెంట్ కార్మికులకు నష్టపరిహారం చెల్లించిన యాజమాన్యం, కాంట్రాక్ట్ కార్మికునికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనీ, ఉపాధి అవకాశాలు కల్పించాలని పలుమార్లు కోరినా యాజమాన్యం స్పందించకపోవడంతోనే ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు.