Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయం ఉమ్మడి జాబితాలోని అంశం
- మోడీ సర్కార్‌ది బాధ్యతారాహిత్యం : మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యాంగం ప్రకారం మద్దతు ధరతోపాటు పంట ఉత్పత్తుల కొనుగోళ్ల బాధ్యత కూడా కేంద్రానిదేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయమనేది ఉమ్మడి జాబితాలోని అంశమని గుర్తు చేశారు. ఈ క్రమంలో కేంద్రం తన బాధ్యతను విస్మరించొద్దని అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినరు భాస్కర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. పంజాబ్‌లోని ధాన్యాన్ని మొత్తం కొంటున్న కేంద్రం... తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపుతున్నదని ఆయన విమర్శించారు. తెలంగాణ అనేది ఇండియాలో భాగం కాదా..? అని ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్షను ప్రదర్శిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి బీజేపీ నేతలు వ్యవసాయ కమిషనరేట్ దగ్గర ధర్నా చేయడం ఓ డ్రామా అని కొట్టిపారేశారు. కమిషనర్ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా..? అని నిలదీశారు. వరి వేస్తే రైతుబంధు కట్ అవుతుందంటూ బీజేపీ... సోషల్ మీడియాలో దుర్మార్గంగా ప్రచారం చేయటం శోచనీయమన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఆ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. వరి వేస్తే ఉరే అంటూ తామెక్కడా చెప్పలేదన్నారు. అయితే కొందరు వ్యవసాయ నిపుణులు మాత్రం రైతాంగానికి అలాంటి హెచ్చరికలు చేశారని వివరించారు. కేంద్రానికి చేతకాకపోతే ధాన్యం కొనుగోలు చేయబోమంటూ స్పష్టంగా చెప్పాలని సూచించారు. అప్పుడేం చేయాలో తామే నిర్ణయించుకుంటామని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
బాధ పడితే..విచారం
మంగళవారం మరదలు' అంటూ తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరైనా బాధపడితే విచారం, పశ్చాతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలపై శుక్రవారంనాడాయన వివరణ ఇచ్చారు. ''నేను ఎవరి పేరుతో ఆ వ్యాఖ్యలు చేయలేదు. ఏకవచనం వాడలేదు. చివరన అమ్మా అని కూడా అన్నాను'' అని మంత్రి వివరించారు.