Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్‌మీట్‌ను వరంగల్ పోలీసులు అడ్డుకున్నారు. శనివారం మధ్యాహ్నం వరంగల్ స్టేషన్‌రోడ్డులోని గ్రాండ్ గాయత్రి హౌటల్లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌కు ఈటల విచ్చేశారు. విషయం తెలుసుకున్న వరంగల్ ఏసీపీ గిరికుమార్ ఎన్నికల కోడ్ ప్రకారం పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రెస్మీట్లు పెట్టొద్దని అడ్డుకున్నారు. హౌటల్‌లోకి రాకముందే 'ఈటల'ను అడ్డుకోవడంతో బీజేపీ నేతలు, మాజీ ఎంపీ వివేక్, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగి 'ఈటల'ను లోపలకు తీసుకువెళ్లారు. అనంతరం బీజేపీ నేతలు ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా.. ఏసీపీ గిరికుమార్ సెక్షన్ 126ప్రకారం స్టార్ క్యాంపెయినర్లు ప్రచారం గడువు ముగిశాక ప్రెస్‌మీట్ పెట్టొద్దని అడ్డుకునే ప్రయత్నం చేయగా బీజేపీ నేతలు ఏసీపీతో వాగ్వాదానికి దిగారు. హుజురాబాద్‌లో పట్టపగలు డబ్బులు పంచుతుంటే అడ్డుకోలేని పోలీసులు తమను ప్రెస్‌మీట్ పెట్టకుండా అడ్డుకోవడం దారుణమని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. హన్మకొండలో మంత్రి దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రెస్‌మీట్ పెడితే అడ్డుకోని మీరు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ఏసీపీని ప్రశ్నించారు.