Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణిలో అమల్లోకి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
బ్యాంకుల్లో కార్పోరేట్ శాలరీ అకౌంట్ కలిగి ఉన్న సింగరేణి ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు చెల్లించే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను సింగరేణి సంస్థ తొలిసారిగా అమల్లోకి తెచ్చింది. హైదరాబాద్ సింగరేణి భవన్ లో సింగరేణి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఇటీవల మతి చెందిన కోసూరి సుదర్శన్ కుటుంబసభ్యులకు ఈ స్కీం క్రింద రూ.15 లక్షల చెక్కును అందచేశారు. సంస్థ డైరెక్టర్లు ఎస .చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్ బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), డి సత్యనారాయణరావు (ఈ అండ్ ఎం) మృతుని భార్య, కుమారుడికి ఈ చెక్కును ఇచ్చారు. సింగరేణి ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలు ఉన్న వివిధ బ్యాంక్‌ల ఉన్నతాధికారులతో డైరెక్టర్ ఎన్ బలరాం స్వయంగా మాట్లాడి, ఈ ఖాతాలను కార్పోరేట్ శాలరీ అకౌంట్లుగా మార్చడమే కాక ఈ అకౌంట్లకు వర్తించే ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రయోజనాలు కూడా వెంటనే అమలు జరపాలని కోరారు. దీనికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో పాటు ఇతర బ్యాంకులు కూడా అంగీకరించడంతో కార్పోరేట్ శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి కార్మికుడికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఎవరైనా కార్మికుడు ప్రమాదవశాత్తూ మతి చెందినట్లయితే అతని ఖాతా ఉన్న బ్యాంక్ వారు ఇన్సూరెన్స్ కింద రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఇన్సూరెన్సు సొమ్ము చెల్లిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెక్కన్ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నతాధికారులతో సింగరేణి డైరెక్టర్లు మాట్లాడారు. సింగరేణి కార్మికులు బ్యాంకుల నుంచి తీసుకునే వ్యక్తిగత రుణాలు, ఇంటి నిర్మాణ, వాహన రుణాలపై ఇతరుల కన్నా తక్కువ వడ్డీ తీసుకోవాలనీ, లోన్ పొందే విధానాన్ని మరింత సులభతరం చేయాలని కోరగా.. దీనిపై బ్యాంకర్లు సానుకూలంగా స్పందించినట్టు వారు తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఒక అవగాహన ఒప్పందం చేసుకుంటామని చెప్పారు.