Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
నిజామాబాద్ జిల్లాలో ఎస్సార్ఎస్పీ ప్రాజెక్టు కోసం 1966లో భూమిని సేకరిస్తే 55 ఏండ్లు అయినా రైతులకు పరిహారం చెల్లించకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపుపై 30 ఏండ్ల క్రితం అవార్డు వెలువడినా నేటికీ కోర్టులు చుట్టూ రైతులు తిరగాల్సిన పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. రైతులు ముష్టివాళ్లు అనుకోవద్దని, వాళ్లకు పరిహారం ఇవ్వడమంటే ఏదో దానం చేయడం అసలే అనుకోవద్దని ఘాటుగా చెప్పింది. ఎన్నాళ్లు కోర్టుల చుట్టూ తిరగాలని ప్రశ్నించింది. తరాలు మారిపోతున్నాయని, వాళ్ల తలరాతలు మార లేదని, చట్ట ప్రకారం సకాలంలో పరిహారం అందించి ఉంటే వాళ్ల జీవితాలు మరోలా ఉండేవని వ్యాఖ్యానించింది. భూపరిహార కేసుల జాప్యంపై మహబూబ్‌నగర్ జిల్లా జడ్జి రాసిన లేఖను గతంలో హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ చేస్తోంది. ఈ కేసులో ఉత్తర్వులకు అనుగుణంగా అధికారులు తనకు పరిహారం ఇవ్వలేదని ఎస్సార్ఎస్పీ భూనిర్వాసితుడు బక్కూరి లింగన్న ఇతరులు కోర్టుధిక్కార కేసు వేశారు. దీనిని శుక్రవారం చీఫ్ జస్టిస్ సతీష్‌చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. భూపరిహారం చెల్లించకుండా రైతుల నుంచి భూములు తీసుకునేందుకు వీల్లేదని, అయినా ప్రభుత్వాలు భూములు తీసుకోవడం, పరిహారం ఇవ్వకపోవడం, ఇచ్చినా చట్ట ప్రకారం లేవని కేసులు దాఖలు కావడంతో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది. పరిహారం చెల్లింపుల విషయంలో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పిటిషనర్లు ఇప్పుడు ఇచ్చే పరిహారంతో నష్టపోయిన 3 ఎకరాలను కొనుగోలు చేయలేరని, కనీసం ఎకరం భూమిని కూడా కొనలేనంతగా భూముల ధరలు పెరిగాయని చెప్పింది. గత ఉత్తర్వుల మేరకు హైకోర్టు విచారణకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణారావు శుక్రవారం హైకోర్టు విచారణకు హాజరయ్యారు. తదుపరి విచారణ డిసెంబర్ 16కి వాయిదా పడింది.