Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈశ్రమ్ పోర్టల్‌లో కార్మికుల పేర్లను ప్రభుత్వమే నమోదు చేయాలి
- ఐకేపీ హమాలీలకు కూలిరేట్లు పెంచాలి
- అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు విధి విధానాలు రూపొందించాలి
- లేనిపక్షంలో దశలవారీగా ఆందోళనలు.. కలెక్టరేట్ల ముట్టడులు
- డిసెంబర్ 20న చలో హైదరాబాద్ :తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.భాస్కర్, పి.సుధాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హమాలీ కార్మికులకు వెంటనే వెల్ఫేర్ బోర్డ్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పి.సుధాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐకేపీ హమాలీలకు కూలిరేట్లు పెంచాలనీ, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు విధివిధానాలను రూపొందించాలని కోరారు. ఈ శ్రమ్ పోర్టల్‌లో కార్మికుల పేర్లను ప్రభుత్వమే నమోదు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే నవంబర్, డిసెంబర్ నెలల్లో దశలవారీగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే డిసెంబర్ 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ ఫెడరేషన్ రాష్ట్ర సదస్సు రాష్ట్ర ఉపాధ్యక్షులు దండేపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగింది. అందులో రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి వీరాస్వామి, తిరుపతి రామమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు కె. బాలయ్య, కనకయ్య, అంబయ్య, ఆంజనేయులు, సవారీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాస్కర్, సుధాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఐదు లక్షల మంది హమాలీ కార్మికులున్నారనీ, వారి సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని చెప్పారు. వారి కోసం ఏర్పాటు చేస్తామన్న వెల్ఫేర్‌బోర్డు ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హమాలీ కార్మికులలో అత్యధికులు అట్టడుగు సామాజిక తరగతులకు చెందినవారేనన్నారు. పని భద్రత, గుర్తింపు కార్డులు, పని గంటలు, ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి ఏ ఒక్క సౌకర్యమూ వారికి అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి హమాలీకి ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించాలనీ, ప్రమాదంలో మరణించిన కార్మికునికి రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళటానికి కార్మికులకు ప్రయాణపు ఛార్జీలను చెల్లించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో సివిల్ సప్లరు కార్పొరేషన్ కూలిరేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. సివిల్ సప్లరు, జీసీసీ బేవరేజస్, ఎలక్ట్రిసిటి స్టోర్స్, తదితర హమాలీలను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. నవంబర్ 15 నుంచి 20 వరకు హమాలీలు యాజమాన్యాలకు, సంస్థలకు వినతిపత్రాలను ఇవ్వాలని సూచించారు. అదే నెల 22న అన్ని మండల కేంద్రాలలో తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇవ్వాలనీ, 29న ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. హమాలీల వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ డిసెంబర్ ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు స్థానిక ప్రజాప్రతినిధులకు కలిసి వినతిప్రతాలు ఇవ్వాలన్నారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే డిసెంబర్ 8న కలెక్టరేట్లను ముట్టడిస్తామనీ, అదే నెల 20 చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు.