Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ విధానాలు సమర్ధిస్తున్న కేసీఆర్
- ఆ ఇద్దరి కుట్రలను తిప్పికొట్టాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
నవతెలంగాణ- నేలకొండపల్లి
భారతదేశ వ్యవసాయ రంగాన్ని, రైతు వ్యవస్థను కార్పొరేట్ శక్తులకు ప్రధానమంత్రి మోడీ తాకట్టు పెడుతున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించి కార్యాలయ నిర్మాణం విషయంలో మండల కమిటీకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు తన భార్య కమలమ్మ జ్ఞాపకార్థం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణానికి విరాళంగా ఇస్తున్న రూ.ఐదు లక్షలు తమ్మినేని చేతుల మీదుగా స్థానిక మండల నాయకత్వానికి అందజేశారు. విరాళం అందజేసిన వెంకటేశ్వర్లును తమ్మినేని అభినందించారు. అనంతరం తమ్మినేని మాట్లాడుతూ.. దేశంలో పంటల సాగులో, ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన విధానాలను అవలంబిస్తోందనీ, వాటిని సీఎం కేసీఆర్ సమర్ధించడం దారుణమన్నారు. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయడంలో, ప్రభుత్వ ఆస్తులను అమ్మడంలో మోడీ, కేసీఆర్ కార్పొరేట్లకు సహకరిస్తూ సాధారణ ప్రజానీకాన్ని మోసం చేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడం విషయంలో కూడా కార్పొరేట్ శక్తుల హస్తం ఉందన్నారు. అంతర్జాతీయ సంస్థలైన అమెజాన్, వాల్మార్ట్ వంటి కార్పొరేట్ కంపెనీలకు సహకరించేందుకే దేశంలో వరి, గోధుమలు పండించవద్దనీ, ధాన్యం కొనుగోలు చేయలేమని కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోందన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులు పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వ్యవసాయం చట్టాలపై ఎందుకు ఉద్యమించడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసనలు, సామూహిక దీక్షల పేరుతో ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు బుగ్గవీటి సరళ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, బండి పద్మ, ముదిగొండ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, వైస్ ఎంపీపీ మంకెన దామోదర్, మందరపు వెంకన్న, కందుల భాస్కర్రావు, ఐద్వా నాయకులు మందరపు పద్మ, మండల నాయకులు పాల్గొన్నారు.