Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికలు రూపొందిస్తున్న మహిళా భద్రతా విభాగం
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పాఠశాల విద్యార్థులలో సైబర్ నేరాల పట్ల అవగాహనను పెంచడానికి ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అధికారులు యోచిస్తున్నారు. దీనికి సంబంధించి తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నారని తెలిసింది. అధికారవర్గాలు తెలిపిన సమాచారం మేరకు.. రాష్ట్రంలో రోజు రోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోవడం, ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల బారిన టెన్త్ క్లాసు విద్యార్థులు కూడా పడుతున్నారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు సైబర్ నేరాలపై ఇంటర్, డిగ్రీ , ఆపై తరగతుల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర మహిళా భద్రతా విభాగం నిర్వహించింది. దీని వల్ల మంచి ఫలితాలు కూడా వచ్చాయని అధికారులు భావిస్తున్నారు. కాగా తాజాగా పాఠశాల విద్యార్థులు సైతం సైబర్ నేరాల పాలిట పడుతున్నారని సమాచారం అందుతుండటంతో నివారణ చర్యలపై దృష్టిని సారించారు. ఈ మేరకు పాఠశాల స్థాయిలో ముఖ్యంగా టెన్త్ క్లాసు విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం ద్వారా సైబర్ నేరస్తుల కుట్రలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదలు ప్రయివేటు పాఠశాలల్లో వారానికి ఒక రోజు లేదా పదిహేను రోజులకు ఒక మారు సైబర్ నేరాలపై అవగాహన తరగతులను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన ట్యూటర్లను ఎంపిక చేయడానికి గాను ఎన్జీవో సంస్థల నుంచి సహకారాన్ని తీసుకుంటున్నారు. అయితే ప్రయోగాత్మకంగా జిల్లాకు ఒక పాఠశాలను ఎంపిక చేసి అమలు చేయాలని భావిస్తున్నారు. వీటిలో ఈ ప్రయోగం ఏ మేరకు ఫలితాన్ని ఇచ్చింది పరిశీలించి తదుపరి అడుగులు వేయాలని అధికారులు యోచిస్తున్నారు.